టీఆర్‌ఎస్ కుర్చీ కాళ్లు పదిలమేనా..?
అయితే స్వరాష్ట్ర సాధించిన తరువాత నిధులు, నియామకాలు, నీళ్లు కోసం ప్రతి తెలంగాణ పౌరుడు ఎదురుచూశారు. తెలంగాణకు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ మాట తప్పి తానే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. ఎవ్వరూ కూర్చుంటే ఏముందిలే ప్రజారంజక పాలనే ముఖ్యమని అనుకున్న ప్రతిపక్షాలు, ప్రజలకు మొదటి దఫా పాలనతోనే విసుగు చెందింది. అంతేకాకుండా కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి కనిపించలేదు. కొన్నికొన్ని చోట్ల ఓట్ల లెక్కింపు చివరివరకు గెలుపుపై ధీమా వ్యక్తం చేయలేకపోయారు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కూర్చున్న కుర్చీకి కాళ్లుగా ఉన్న ఎమ్మెల్యేలపై ప్రస్తుతం ప్రజల్లో ఏ రేంజ్‌లో విముఖత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నటి మొన్న ఓ ప్రారంభోత్సవానికి వెళ్లిన ట్రబుల్ షూటర్ మంత్రి హరీశ్‌రావుకు సైతం ప్రజల నుంచి ప్రత్యక్షంగా నిరసన సెగలు తప్పలేదు.
ఇంకా కొన్ని చోట్లైతే గత ఎన్నికల ఫలితాల్లో చావుతప్పి కన్నులొట్టపోయిన ఎమ్మెల్యే గ్రాఫ్ పరిస్థితి మరీదారుణంగా పడిపోతోంది. రోజురోజుకు ఆయా ఎమ్మెల్యేలపై విముఖత పెరిగిపోవడంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడంమంటే అతిశయోక్తే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ హుజురాబాద్ కేంద్రంగా ప్రకటించిన సంక్షేమ పథకాలు కూడా టీఆర్‌ఎస్‌కు గండంగానే తయారయ్యాయి. ముఖ్యంగా దళిత బంధు పథకం ఎన్నికల అనంతరం కొనసాగిస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పటికీ దానిపై స్పష్టత ఇవ్వకపోవడం కూడా టీఆర్ఎస్ పార్టీకి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది.