ఒమిక్రాన్ టెస్ట్ కిట్ రెడీ.. 2గంటల్లోనే ఫలితం..!

NAGARJUNA NAKKA
కేవలం రెండు గంటల్లోనే ఒమిక్రాన్ ను గుర్తించే టెస్ట్ కిట్ ను భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం కరోనా కేసుల్లో ఒమిక్రాన్ ను నిర్ధారించేందుకు మూడు, నాలుగు రోజుల సమయం పడుతోంది. దీంతో ఐసీఎంఆర్ కు చెందిన డాక్టర్ బిశ్వజ్యోతి ఆధ్వర్యంలోని నిపుణుల బృందం ఈ కిట్ ను రూపొందించింది. వెయ్యిమంది కొవిడ్ బాధితుల నమూనాలపై దీనిని పరీక్షించారు. ఖచ్చితమైన ఫలితాలు వస్తున్నట్టు గుర్తించారు.
ఇక మన దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో తాజాగా మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 20మందికి ఈ వేరియంట్ సోకింది. కొత్తగా నమోదైన కేసులతో మన దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 40కి చేరింది. ఇదిలా ఉండగా ఈ రోజు బ్రిటన్ లో ఒమిక్రాన్ సోకిన వ్యక్తి మరణించడం ఆందోళన కలిగిస్తోంది.
అంతేకాదు కరోనా పుట్టిన చైనాకు ఒమిక్రాన్ వేరియంట్ పాకింది. ఆ దేశంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. తియాంజిన్ నగరంలో ఓ వ్యక్తికి ఈ వేరియంట్ సోకిందని అక్కడి అధికారులు గుర్తించారు. ఆ వ్యక్తి విదేశాలు తిరిగి వచ్చినట్టు వెల్లడించారు. మరోవైపు సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమసోఫాకు కరోనా సోకింది. ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. అయితే ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తొలుత సౌతాఫ్రికాలోనే వెలుగు చూసిన కారణంగా అధ్యక్షుడికి పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఆయనకు ఏ వేరియంట్ సోకిందనే వివరాలను అధ్యక్ష కార్యాలయం వెల్లడించలేదు. అయితే రమసోఫా ఇప్పటికే రెండు డోసుల వ్యక్సిన్ తీసుకున్నారు.
ప్రపంచ దేశాలు వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ చాలా ప్రమాదకరమని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. వ్యాక్సిన్ నుంచి ఇది తప్పించుకోలగదని చెప్పడానికి కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయని చెప్పింది. దీని తీవ్రత ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. అయితే.. తీవ్రతను అంచనా వేసేందుకు సరిపోయే డేటా తమ దగ్గర లేదని వెల్లడించింది. చాలా వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఈ వేరియంట్ కు ఉన్నాయని మరోసారి స్పష్టం చేసింది.





 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: