ఆ ఉద్యోగ సంఘాల నేతలు.. ఎమ్మెల్యే సీటుపై గురి పెట్టారా..?

Chakravarthi Kalyan
ఏపీలో కొన్నిరోజుల క్రితం ఉద్యోగ సంఘాల నేత ఒకరు అవసరమైతే ప్రభుత్వాలను కూల్చేస్తాం అన్న వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యాయి. అసలు ఉద్యోగ సంఘాల నేతలు అలా మాట్లాడొచ్చా.. అసలు కేవలం ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వాలను కూల్చే శక్తి ఉందా అన్న చర్చ కూడా మొదలైంది. అయితే.. ఇక్కడ ఒక విషయం గమనించాలి.. అదేంటంటే.. ఇలా ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాలపై ఘాటు విమర్శలు చేయడం కొత్తేమీ కాదు.. గతంలోనూ చాలా మంది నేతలు ఇంతకంటే ఎక్కువగా ప్రభుత్వాలను విమర్శించారు.. ప్రభుత్వాలను కూలుస్తామని హెచ్చరించారు కూడా.

అయితే. ఈ నేతల వెనుక మాటల అంతరార్థం కూడా మనం గమనించాలి. సాధారణంగా ఉద్యోగ వర్గాలపై పట్టు కోసం కొందరు నేతలు ఇలాంటి వివాదాస్పద అంశాలపై ఘాటుగా వ్యాఖ్యానిస్తుంటారు. అది తమ ఉద్యోగుల్లో ఆత్మ స్థైర్యం నింపడం కోసం.. ఉత్సాహం నింపడం కోసం కూడా కావచ్చు. మరికొందరు ఉద్యోగ సంఘాల నేతలు.. తమ రాజకీయ భవిష్యత్ కోసం కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇలాంటి వారు.. తమ ఉద్యోగ విరమణ తర్వాత రాజకీయాల్లో చేరుతుంటారు. ఏదో ఒక పార్టీ నుంచి అధికారం అందుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. ఒకసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే.. ఉమ్మడి ఏపీలో  కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ఇలాగే మాట్లాడేవారు. స్వామినాదన్, పూర్ణచంద్రరావు అనే ఇద్దరు ఎన్జీవో నేతలు.. తరచూ  ప్రభుత్వంపై విమర్శలు చేసేవారు. వారిద్దరూ రిటైర్ అయ్యాక తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇక ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఒకప్పటి ఎన్జీవో నేత అశోక్ బాబు సంగతి కూడా చాలామందికి తెలిసిందే.


తెలంగాణ ఉద్యమ సమయంలో అశోక్‌బాబు సమైక్యాంధ్ర తరపున చాలా పోరాటం చేశారు. ఆయనకు ఓ రాజకీయ నాయకుడి కంటే ఎక్కువ పాపులారిటీ అప్పడు వచ్చింది. దాంతోనే ఆయన ఆ తర్వాత టీడీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. మరి ప్రస్తుతం వైసీపీ సర్కారుపై విరుచుకుపడుతున్న వారికి కూడా ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా అన్న చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: