కొత్త రూల్: 18ఏళ్లు దాటినవారికే సిగరెట్ల అమ్మకం

Deekshitha Reddy
సిగరెట్ల అమ్మకంపై ప్రభుత్వం ఆంక్షలు కఠినతరం చేస్తోంది. ధూమపానాన్ని శాశ్వతంగా నిషేధించే లక్ష్యంతో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా సిగరెట్ల అమ్మకం విషయంలో ఓ కొత్త ప్రతిపాదనకు అధికారులు శ్రీకారం చుట్టారు. దేశంలో ఇప్పటి వరకూ సిగరెట్ తాగాలంటే ఉండాల్సిన కనీస వయసును 18 కంటే పెంచాలని నిర్ణయించారు. ప్రతీ సంవత్సరం ఇలా పెంచుకుంటూ పోవాలని భావిస్తున్నారు. దీని కారణంగా చిన్న వయసులో సిగరెట్లు తాగే అలవాటును అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఇదంతా చేస్తుంది మన భారత ప్రభుత్వం అనుకుంటే మీరు పొరబడినట్టే.. న్యూజిలాండ్ ప్రభుత్వం తమ దేశ పౌరులకు కొత్తగా తీసుకున్న నిర్ణయాలే ఇవన్నీ.

న్యూజిలాండ్ లో స్మోకింగ్ చేయాలంటే ఇప్పటివరకూ 18 ఏళ్ల వయసు పరిమితి ఉండేది. అయితే ఇప్పుడు న్యూజిలాండ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనతో 18 లోపు వయసున్న ఎవరికీ ఇకపై సిగరెట్లు అమ్మకం జరగదు. వచ్చే ఏడాది ఈ బిల్లును ప్రవేశపెట్టి.. అమలు చేస్తామని అక్కడి అధికారులు చెబుతున్నారు. న్యూజిలాండ్ లో 14 ఏళ్ల వయసున్న చిన్నారులు ఎక్కువగా ధూమపానానికి అలవాటు పడుతుండం గమనించిన ప్రభుత్వం.. ఇలాంటి చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఎన్నో అవగాహనా కార్యక్రమాలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఇలా కఠిన చర్యలకు ఉపక్రమించినట్టు అధికారులు చెబుతున్నారు.

మరోవైపు 2025 నాటికి ధూమపానం చేసేవారిని భారీగా కట్టడి చేయాలని న్యూజిలాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ధూమపానం చేసేవారి శాతం ఐదులోపే ఉండేలా చూడాలని స్థానిక అధికారులను కూడా ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. మరోవైపు సిగరెట్ల తయారీ కంపెనీలకు కూడా వార్నింగ్ ఇచ్చింది. సిగరెట్లలో నికోటిన్ తక్కువ మోతాదులోనే ఉండేలా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. సిగరెట్లు అమ్మే దుకాణాలను కూడా భారీగా తగ్గిస్తామని అంటున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కనీసం భవిష్యత్తు తరాల వారైనా ఈ దురలవాట్లకు దూరంగా ఉండేలా చూడటమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: