APSRTC ఉద్యోగులకే కాదు ప్రయాణీకులకూ శుభవార్త..!

NAGARJUNA NAKKA
APSRTC  లో కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు ఇచ్చేందుకు ఖాళీ పోస్టుల వివరాలను అధికారులు ప్రకటించారు. 93కండక్టర్లు, 1334 డ్రైవర్లు, 1040అసిస్టెంట్ మెకానిక్స్, 97జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. ఆయా పోస్టుల్లో అర్హులైన వారిని నియమించాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అర్హులు ఆయా డీపోల్లోని అధికారులు సంప్రదించాల్సి ఉంటుంది.
అంతేకాదు APSRTCలో రెండేళ్ల క్రితం పదవీ విరమణ చేసిన సిబ్బంది బకాయిలు విడుదల చేయాలని ఎండీ ద్వారకా తిరుమల రావు ఆదేశాలు జారీ చేశారు. 2019 మార్చిలో నాటి టీడీపీ ప్రభుత్వం వేతన సవరణ చేసింది. దానికి అనుగుణంగా సెప్టెంబర్ వరకూ 6నెలల్లో రిటైర్డ్ అయిన 1200మందికి పూర్తి స్థాయిలో సెటిల్ మెంట్ చేయలేదు. ఈ కారణంగా.. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన 36కోట్ల రూపాయలు డిసెంబర్ లోపు ఇచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయి.
మరోవైపు క్రిస్మస్, సంక్రాంతి పండగకు దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం 30రోజులుగా ఉన్న ముందస్తు రిజర్వేషన్ గడువును 60రోజులకు పెంచింది. ఈ నిర్ణయం డిసెంబర్ 2వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అయితే పండగ సీజన్ లో చివరి నిమిషంలో బస్ టికెట్లు బుక్ చేసుకున్న వారికి అదనపు ఛార్జీల్ని ఆర్టీసీ వడ్డించేది. తాజా నిర్ణయం వల్ల ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఆ ఛార్జీల బెడద తప్పనుంది.
అంతేకాదు కార్గో డోర్ డెలివరీ విధానాన్ని apsrtc నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలోని 16 డిపోల పరిధిలో సెప్టెంబర్ 1నుంచే ఈ సేవలను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఆర్టీసీ.. ప్రజల నుంచి స్పందన అద్భుతంగా ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 1వ తేదీ నుంచి కార్గో సేవలను మరింత విస్తృతం చేసింది. నగరాలు, పట్టణాలను ఒక యూనిట్ గా పరిగణిస్తూ రాష్ట్రంలోని 94డిపోల పరిధిలో కార్గోల సర్వీసుల డోర్ డెలివరీ విధానం అందుబాటులోకి తీసుకొస్తోంది.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: