కేంద్ర ప్రభుత్వానికి హరీశ్ రావు రాసిన లేఖలో..!

NAGARJUNA NAKKA
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కొవిషీల్డ్ 2డోసుల వ్యవధిని తగ్గించాలని కోరారు. 4నుంచి 6వారాల వ్యవధిలో రెండో డోసుకు అనుమతివ్వాలన్నారు. అలాగే హెల్త్ కేర్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్ వారియర్లకు బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో టీకా పంపిణీని వేగవంతం చేసేందుకు సీఎస్.. ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వైద్యాధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలో విదేశాల నుంచి వచ్చిన ఓ యువతి అధికారులను కంగారు పెట్టించింది. హైదరాబద్ లోని కుత్బుల్లాపూర్ కు చెందిన ఓ యువతికి కరోనా అని తేలింది. దీంతో అధికారులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా.. తప్పించుకొని పారిపోయింది. దీంతో గాలింపు చేపట్టగా.. ఆమె అడ్రస్ ప్రూఫ్ ఆధారంగా ఆచూకీ కనుగొన్నారు. తర్వాత ఆ యువతి టిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ఒమిక్రాన్ కేసులు నమోదైన కారణంగా ఇలాంటి ఘటనలు బెంబేలెత్తిస్తున్నాయి.

హైదరాబాద్ టిమ్స్ ఆస్పత్రిలో కోరనా కలకలం సృష్టించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 13మందికి కరోనా పాజిటివ్ రాగా.. వీరంతా ఇటీవల విదేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన వారిగా గుర్తించారు. వీరిలో సోకిన వేరియంట్ గుర్తించేందుకు శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. అయితే ఇప్పటి వరకు బెంగళూరులో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
ఇక సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇంద్రదేశం గురుకుల పాఠశాలలో ఈ రోజు 584మందికి టెస్టులు చేయగా.. మరో 19మంది బాలికలకు కరోనా పాజిటివ్ వచ్చింది. మూడు రోజుల్లో 46మంది కరోనా బారిన పడ్డారు. వైరస్ భయంతో కొందరు బాలికలను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్తున్నారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా ముత్తంగి, ఖమ్మం జిల్లా వైరాలోని గురుకులాల్లోనూ కరోనా కేసులు వెలుగు చూశాయి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: