బాబు ఫైర్.. మంత్రులు, ఎమ్మెల్యేలు గాడిదలు కాస్తున్నారా..?

Chakravarthi Kalyan
వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. బుధవారం  చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. గురువారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. నెల్లూరు జిల్లాలో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు కాలినడక పర్యటించారు. ప్రత్యేకించి గంగపట్నంలో ముంపు బాధితుల్ని చంద్రబాబు  పరామర్శించారు. బాధితుల ఇళ్లలోకి వెళ్లి మరీ చంద్రబాబు వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు.

అనూహ్యంగా వచ్చిన వరదలకు ఇళ్లన్నీ వరదకు బురదమయం అయ్యాయని బాధితులు చంద్రబాబు ముందు విలపించారు. బురద మయం అయిన ఇళ్లలోకి వెళ్లి మరీ చంద్రబాబు పరిశీలించారు. ఆ సమయంలోనే ఆయన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. బురదమయం అయిన 150ఇళ్ళు బాగు చేయటం ప్రభుత్వం తలచుకుంటే ఎంత సేపు అని ప్రశ్నించిన చంద్రబాబు.. ఈ పనులు పర్యవేక్షించాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడ గాడిదలు కాస్తున్నారో అర్ధం కావట్లేదని మండిపడ్డారు.

ఇంతగా మొద్దు నిద్ర నటిస్తున్న ప్రభుత్వ పెద్దల్ని తిట్టాలంటే సభ్యత, సంస్కారం అడ్డొస్తున్నాయన్న చంద్రబాబు... వైసీపీ నాయకులు ప్రజల్ని ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు తప్ప మనుషులుగా చూడట్లేదని విమర్శించారు. సంక్షోభం వచ్చినప్పుడు ప్రజలు కష్టాలు తీర్చలేని ప్రభుత్వం ఎందుకు అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతిపక్షంగా నా బాధ్యతగా మీ ముందుకు వస్తే.. ముఖ్యమంత్రి మాత్రం విందులు, వినోదాల్లో బిజీగా ఉన్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్.. అసెంబ్లీలో భజన బృందాలను పెట్టుకుని తనని తాను పొడిగించుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని చంద్రబాబు ఆగ్రహించారు. గంగపట్నంలో పర్యటించిన చంద్రబాబు అక్కడ నష్టపోయిన గిరిజనులు, మత్స్యకారులను ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఆదుకుంటామన్నారు. ఇక్కడ కుటుంబానికి రూ.5వేలు ఆర్థిక సాయం ప్రకటించిన చంద్రబాబు... ముంపులో కొట్టుకుపోతున్న ఇద్దరి ప్రాణాలు కాపాడిన మత్య్సకారుడు సురేష్ కు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున నగదు ప్రోత్సాహం ప్రకటించారు. ఆక్వా రంగం తిరిగి కోలుకునే వరకు ప్రభుత్వం తోడ్పాటు ఇవ్వాలని.. బాధితులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: