రైతు విజయం: మోడీ మెడలు వంచిన రైతన్న!

Chakravarthi Kalyan
దేశంలో రైతన్న మరోసారి విజయం సాధించాడు.. నెలల తరబడి ఓపికగా పోరాడి ఏకంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాడు. ఈ దేశానికి అన్నం పెట్టడమే కాదు.. అవసరమైతే పోరాటమూ తెలుసని నిరూపించాడు. అలుపెరగకుండా.. పోరాడి ఈ దేశానికి పరోక్షంగా మేలు చేశాడు.. రైతన్న నెలల తరబడి చేసిన పోరాటంతో కేంద్రం దిగొచ్చింది. నూతన సాగు చట్టాలపై వెనక్కి తగ్గింది. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామంటూ ఏకంగా ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు.


నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని మోదీ.. పార్లమెంట్ సమావేశాల్లో సాగు చట్టాల రద్దుపై ప్రకటన చేస్తామన్నారు. ఈ నెలాఖరు నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రకటన చేస్తామని ప్రధాని చెప్పడం ద్వారా సాగు చట్టాలకు మంగళం పాడేశారు.అన్నదాతల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రధాని మోడీ..వ్యవసాయ బడ్జెట్‌ను ఐదు రెట్లు పెంచామని చెప్పుకున్నారు. రైతులకు తక్కువ ధరకే విత్తనాలు లభించేలా కృషి చేస్తామన్నారు. 22 కోట్ల భూసార పరీక్ష కార్డుల పంపిణీకి చర్యలు చేపట్టామని చెప్పుకొచ్చారు.


రైతు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్న ప్రధాని.. ఫసల్ బీమా యోజనను మరింత బలోపేతం చేస్తామన్నారు. ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూరేలా ఫసల్ బీమా యోజనని తీర్చిదిద్దుతామన్నారు. అయితే ఇలాంటి డైలాగులు మోడీ ఎన్నికొట్టినా సాగు చట్టాలపై బీజేపీ చేసిన రాద్దాంతం మాత్రం రైతన్న మరిచిపోయేదేమీ కాదు.  


రైతు ఉద్యమంపై చాలా నెలలుగా ఎదురుదాడి వ్యూహంతో నెట్టుకొట్టిన బీజేపీ సర్కారు.. చివరకు ప్రజావ్యతిరేకతకు భయపడి దిగొచ్చినట్టు కనిపిస్తోంది. ఆలస్యంగానైనా మోడీ సర్కారు మేలుకోవడం ఆహ్వానించదగిన పరిణామమే.  ఏ లక్ష్యంతో చేసినా.. ఏ పరిణామాలతో చేసినా మోడీ సర్కారు తాజాగా తీసుకున్న నిర్ణయం మాత్రం దేశానికి మేలు చేసేదే.. ఒక్క రైతులకే కాదు.. ఆహారం తీసుకునే ప్రతి భారతీయుడికీ మేలు చేసేది ఈ నిర్ణయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: