నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..!
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు.. ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. డిగ్రీ కంప్లీట్ అయిపోయి పలు కోచింగ్ సెంటర్లలో శిక్షణ కూడా తీసుకుంటున్నారు. మరికొందరికి కోచింగ్ కూడా కంప్లీట్ అయిపోయి ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కోచింగ్ లో రాటు దేలిన వారు అయితే.. వెంటనే నోటిఫికేషన్ విడుదల అయినట్టు అయితే అదే జోరుమీద ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టేయొచ్చు అనే యోచనలో ఉన్నారు. కోచింగ్ పూర్తయిన తర్వాత ఎంత లేటయితే అంత నాలెడ్జ్ తరిగిపోతుందనే భావనలో ఉన్నారు. పలు చోట్ల నిరుద్యోగులు ఆత్మహత్యలు కూడా కొనసాగుతున్నాయి. గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్లు విడుదల కాక.. చదువుకు తగ్గట్టు ప్రైవేట్ ఉద్యోగాల్లో చేరలేక తనువు చాలిస్తున్నారు. చదివించిన తల్లిదండ్రులకు చుట్టుపక్కల నుండి సూటి పోటి మాటలు ఎదురవుతుండటంతో మానసికంగా కుంగిపోతున్నారు నిరుద్యోగులు. ఇంట్లో ఖాళీగా ఉండలేక.. ఏం చేయాలో తెలియక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సైతం నిరుద్యోగ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు.
వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. అటు కాంగ్రెస్ కూడా నిరుద్యోగుల ఆత్మహత్యలపై విచారం వ్యక్తం చేస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. 70 నుంచి 80వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించడంతో వారిలో ఆనందం వెల్లువెత్తుతోంది. ప్రిపరేషన్ లో ఉన్న వాళ్లు మరింత కష్టపడేందుకు సిద్ధమవుతున్నారు. కోచింగ్ పూర్తయిన వారు మళ్లీ పుస్తకాలు పట్టేందుకు రెడీ అవుతున్నారు. వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.