గుడ్‌న్యూస్: ఇక బట్టతలపైనా జుట్టు మొలిపించేస్తారట..?

Chakravarthi Kalyan
బట్టతల.. వయస్సు 30 దాటిందంటే.. చాలా మంది మగాళ్లలో ఈ టెన్షన్ మొదలవుతుది.. మరీ దారుణం ఏంటంటే.. కొంత మందిలో 30లోపే ఈ సమస్య వస్తుంటుంది.. ఆస్తులు, అంతస్తులు ఎన్ని ఉన్నా తలపై తగినంత జుట్టు లేకపోతే.. ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుంటుంది. బట్టతలను కవర్ చేసుకునేలా చాలా సదుపాయాలు వచ్చినా.. అవన్నీ చిరాకు కలిగించేవే.. మరి అసలు బట్టతలపై మళ్లీ జుట్టు మొలిపిస్తే.. ఈ దిశగా ఎప్పటి నుంచి పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి.


బట్టతలకు పరిష్కారంగా హెయిల్ ట్రాన్స్ ప్లాంటేషన్‌ వంటి చికిత్సలు ఉన్నాయి.. కానీ.. ఏదీ అసలైన జట్టుకు ప్రత్యామ్నాయం కాదు. కానీ.. నిజంగానే బట్టతలపై జుట్టును సహజంగా మొలిపిస్తే భలే బావుంటుంది.. ఇప్పుడు ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ బట్టతల సమస్య పరిష్కారం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు సాగుతున్నాయి. తాజాగా పాట్నా ఎయిమ్స్ ఈ సమస్యకు చక్కటి పరిష్కారం చూపుతోంది. ఐఐటీలతో కలిసి ఓ చికిత్స విధానాన్ని రూపొందించింది. దీని సాయం ఇకపై బట్టతలపై కూడా జుట్టు సహజంగా మొలుస్తుందట.


బట్టతల సమస్యకు పరిష్కారంగా పాట్నా ఎయిమ్స్ రూపొందించిన చికిత్సలో గామా కిరణాలతో బట్టతలపై వెంట్రుకలు పుట్టుకొచ్చేలా చేస్తారు. ఈ చికిత్స చాలా వరకూ సత్ఫలితాలు ఇస్తోందని ఈ సమస్యపై పరిశోధన చేస్తున్న డాక్టర్ యోగేశ్‌ కుమార్‌ చెబుతున్నారు. ఈ బట్టతల సమస్యతో  మహిళలు కూడా ఎంతో ఆత్మన్యూనతకు, అవమానాలకు గురవుతున్నారని.. తమ విధానం ద్వారా ఆ ఇబ్బందుల నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. సాధారణంగా బట్టతల మూడు దశల్లో వస్తుందట.


డాక్టర్ యోగేశ్‌ కుమార్‌ చెప్పినదాని ప్రకారం జట్టతల సమస్యలో అనాజెన్‌ మొదటి దశ. ఈ దశలో  జుట్టు కుదుళ్లలో చీలికలు వస్తాయి. ఆ తర్వాత వెంట్రుకలు పట్టు కోల్పోతాయి.. రాలిపోతుంటాయి. ఇక రెండో దశ కెటాజెన్‌.. ఈ దశలో జుట్టు పెరగడం తగ్గిపోతుంది. తద్వారా బట్టతల కనిపించడం మొదలవుతుంది. ఇక టెలోజెన్‌ మూడో దశ. ఇందులో ఇక కొత్త జుట్టు మొలవడమే ఉండదు. ఈ సమస్యకు పాట్నా ఎయిమ్స్ ఓ ప్రత్యేక గ్యాడ్జెట్‌ రూపొందించింది. దీంతో గామా కిరణాల ద్వారా టెలోజెన్‌ దశలో ఉన్న సమస్యను కెటాజెన్‌కు మారుస్తారు. అందువల్ల బట్టతలపై కొత్త వెంట్రుకలు మొలవడం ప్రారంభమవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే బట్టతల ఉన్నవారి సమస్య పరిష్కారం అయినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: