కేసీఆర్ VS ఈటల : ఈటల ఆ రోజు చెప్పిన సూక్తి ప్రకారమే జరిగింది..!
2001నుంచి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన ఈటలను సీఎం కేసీఆర్ మంత్రివర్గం నుంచి తొలగించారు. దీంతో ఈటల ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచారు. పొట్టోడి నెత్తిన పొడుగోడు కొడితే.. పొడుగోడి నెత్తిన పోషమ్మ కొడుతుందన్నట్టుగా మిమ్మల్నీ ఎవరో కొట్టేవారు వస్తారు అని ఈటల రాజీనామా సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఇక రాష్ట్ర రాజకీయాల్లో హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం పెద్ద మార్పు తీసుకురానుందని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కేవలం డబ్బును నమ్ముకొని ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కంటైనర్లలో డబ్బు తీసుకొచ్చి పంచారని ఆమె విమర్శించారు. సీఎం కేసీఆర్ ను గద్దె దింపేందుకు తెలంగాణ ప్రజలంతా సిద్ధం అవుతున్నారని డీకే అరుణ వ్యాఖ్యానించారు.
ఈటల గెలుపుపై స్పందించిన మంత్రి హరీశ్ రావు.. ప్రజా తీర్పును శిరసావహిస్తామన్నారు. టీఆర్ఎస్ కు ఓట్లేమీ తగ్గలేదన్న ఆయన.. దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేశాయని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు కూడా చెబుతున్నట్టు పేర్కొన్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నట్టు చెప్పారు. ఏది ఏమైనా టీఆర్ఎస్ ఒక్క ఎన్నికలో ఓటమితో కుంగిపోదన్నారు. గెలిచిననాడు పొంగిపోలేదన్నారు. ఓడినా.. గెలిచినా.. టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పనిచేస్తుందని తెలిపారు. మొత్తానికి ఈటల గెలుపు.. కమలం పార్టీకి తెలంగాణలో మరింత బలాన్ని చేకూర్చినట్టయింది.