ఆంధ్ర, తెలంగాణ దీక్షాదక్షులు: పొట్టి శ్రీరాములు, కేసీఆర్
ఆయన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సాధనలో ఈ నిరాహారదీక్ష ఓ ఆయుధంగా మారింది. 1953లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలన్న డిమాండ్ తో పొట్టి శ్రీరాములు నిర్వహించిన ఆమరణ దీక్ష.. నిరాహార దీక్షల చరిత్రలోనే అత్యంత గొప్ప త్యాగం. మద్రాసులోని బలుసు సాంబమూర్తి నివాసంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష ప్రారంభించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేస్తూ నెహ్రూ ప్రకటన చేసేవరకూ దీక్ష విరమించబోనని పొట్టి శ్రీరాములు భీష్మ ప్రతిజ్ఞ చేశారు.
ఆయన తన ప్రాణాలు పోయే వరకూ అదే మాటలపై ఉన్నారు. ప్రాణత్యాగానికైనా సిద్ధపడ్డారు కానీ.. దీక్ష విరమించేందుకు మాత్రం ముందుకు రాలేదు. రోజూ తేనె కలిపిన నీరు మాత్రమే సేవిస్తూ ఆయన 52 రోజుల పాటు ఆమరణ దీక్ష చేశారు. ఆ తర్వాత దీక్షలోనే ప్రాణాలు వదిలారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన ప్రాణ త్యాగం చేశారు. పొట్టి శ్రీ రాములు మరణంతో మదరాసు రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతం భగ్గుమంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఆ కాకతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు నెహ్రూ తలవంచక తప్పలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశారు నెహ్రూ.
తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ కేసీఆర్ నిరాహార దీక్ష కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. కేసీఆర్ నిరాహారదీక్షకు కూర్చోవడం, ఆయన్ను ఖమ్మం తరలించి దీక్ష భగ్నం చేయడం.. ఓయూలో ఆందోళనలతో దీక్ష కొనసాగిస్తున్నట్టు ప్రకటన చేయడం.. ఆ తర్వాత హైదరాబాద్ నిమ్స్‌కు తరలించడం.. ఉద్యమం ఉజ్జ్వలం కావడం.. చివరకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తూ అప్పటి హోం మంత్రి చిదంబరం ప్రకటన చేయడం.. చక చకా జరిగాయి. అలా తెలుగు నేలలో రెండు దీక్షలు రెండు రాష్ట్రాలను సాధించాయి.