దీపావళి జరుపుకోవచ్చు. సంక్రాంతి ఇంకా ఘనంగా జరుపుకోవచ్చు. కానీ ఉగాది విషయంలోనే కాస్త టెన్షన్ గా ఉంది. నాకు మీకు కాదు ఏపీలో మంత్రులకు. తమ పదవులకు ఎక్స్టెన్షన్ ఉంటుందా లేదా అన్న టెన్షన్ వారిలో కనిపిస్తుంది. అద్భుత విజయంతో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వానికి రెండున్నర ఏళ్ళు నిండాయి. ఓవైపు సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తోంది వైసిపి. ఇప్పుడు అందరి చర్చ మంత్రివర్గంలో మార్పుల గురించే, ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, ఎవరు ఉంటారు, ఎవరు పోతారు అనే చర్చ జరుగుతుంది. ఒక్క మంత్రంతో ఇప్పుడున్న మంత్రులంతా మాయమైపోతారా,అంతా కొత్త మొహాలతో జగన్ క్యాబినెట్ కల కల ఆడబోతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇలాంటి సమయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారట. ప్రభుత్వం ఏర్పాటు చేసి మంత్రివర్గం ప్రకటించినప్పుడు సీఎం జగన్ చెప్పిన మాట ఒక్కటే. రెండున్నరేళ్ల వరకే ఈ క్యాబినెట్, ఆ తర్వాత అంతా కొత్తవారితో మరో క్యాబినెట్ ఏర్పాటు చేస్తానని. దీంతో రాబోయే రెండున్నరేళ్లకు కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందా అన్న విషయంపై చిలక జోస్యం సైతం చెప్పించుకుంటున్నారు ఆశావాహులు. ఈ ఆశావహుల సంఖ్య మామూలుగా లేదు. తాడేపల్లి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు పెద్ద క్యూ కనిపిస్తుంది. జగన్ లెక్కలు జగన్ కు ఉన్నాయి సీనియర్ లెక్కలు సీనియర్లకు ఉన్నాయి. ఆశావహుల లెక్కలు ఆశావహులకున్నాయి. ఈ మధ్యలో కార్యకర్తలు కూడా తమకూ లెక్కలు తెలుసంటూ జిల్లాల వారిగా, కులాల వారిగా కొత్త లెక్కలు వేస్తున్నారు. అటు సిట్టింగులు ఇటు ఆశావహుల మధ్య అదృష్టం కుర్చీలాట ఆడుతుంది. ఆరు నెలలన్నది కూడా ఇప్పటివరకు ప్రచారం మాత్రమే. మరి ముఖ్యమంత్రి మనసులో ఏముంది. రెండు వర్గాల అభిప్రాయాలను వింటున్న జగన్ ఎటు వైపు మొగ్గు చూపుతారు. మాట తప్పని మడమ తిప్పని జగన్ మాట తప్పాలి మడమ తిప్పాలి అని సీనియర్లు కోరుకుంటే మాట తప్పకూడదు మడమ తిప్పం కూడదని ఆశావాహులు ఆశిస్తున్నారు.