మత్తు వదిలించేందుకు సిద్ధమైన సీఎం కేసీఆర్..!

NAGARJUNA NAKKA
తెలంగాణ రాష్ట్రంలో మాద ద్రవ్యాల అక్రమ రవాణా గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతోంది. ఈ కల్చర్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. డ్రగ్స్ బారిన పడిన ఎందరో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మత్తుకు బానిస కావడం వల్ల.. అది లేకుండా ఉండలేకపోతున్నారు. అందుకోసం లక్షలు ఖర్చు పెట్టి మరీ కొనుక్కొని మైకంలో పడిపోతున్నారు. ముఖ్యంగా నైజీరీయన్ ల నుంచి కొనుగోలు చేసి తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. ఈ బ్యాడ్ కల్చర్ కు చరమగీతం పాడేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న డ్రగ్స్ కల్చర్ ను అరికట్టేందుకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారు. ఈ నెల 20వ తేదీన ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్, పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే పోలీస్ శాఖను ఆధునీకరించిన కేసీఆర్.. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నారు. నాటు సారాను అరికట్టడం, పేకాట క్లబ్బుల నిషేధం లాంటివి పటిష్టంగా అమలు చేసిన.. తెలంగాణ పోలీస్ శాఖ ఇతర మాదక ద్రవ్యాలపై దృష్టి పెట్టింది. ఎలాగైనా.. డ్రగ్స్ అమ్మకాలను నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు సీఎం కేసీఆర్ పోలీస్, ఎక్సైజ్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ నెల 20న కేసీఆర్ నిర్వహించే సమావేశానికి మంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ, ఎక్సైజ్ శాఖల ప్రధాన కార్యదర్శులు, డిజీపి మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్లు, ఐజీలు, డీఐజీలు, అడీషినల్ డీజి లా అండ్ ఆర్డర్, ఇంటలిజెన్స్ అడీషినల్ డిజి, జిల్లాల ఎస్పీలు, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, జిల్లా సూపరింటెండెంట్లు, రాష్ట్ర మాదకద్రవ్యాల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులు తదితరులు పాల్గొననున్నారు. జిల్లా ఎక్సైజ్ శాఖాధికారులు తమ జిల్లాల పరిధిలో తలెత్తుతున్న పరిస్థితులు, తీసుకుంటున్న చర్యల గురించి పూర్తి సమాచారంతో రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో డ్రగ్స్ బారిన పడి యువత జీవితాలు చిత్తుకాకూడదనే అభిప్రాయంతో  తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: