రైతు ఉద్యమంలో.. కలకలం రేపుతున్న హత్య..?

Chakravarthi Kalyan
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో మొదలైన రైతు ఉద్యమం నెలల తరబడి కొనసాగుతూనే ఉంది. దిల్లీలోని సింఘు సరిహద్దు వద్ద రైతులు నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉద్యమం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ విషయం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడే తేలాల్సి ఉంది. అయినా రైతులు మాత్రం అక్కడి నుంచి కదల్లేదు. మొదట్లో దేశవ్యాప్తంగా కదలిక రప్పించిన ఈ ఉద్యమం క్రమంగా  వార్తల నుంచి తప్పుకుంది. ఇప్పుడు ఆ ప్రాంతంలో జరిగిన ఓ హత్య కలకలం సృష్టిస్తోంది.

రైతులు ఆందోళన చేస్తున్న దిల్లీ-హర్యానా సరిహద్దు  ప్రాంతంలోని కుండ్లీ వద్ద ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. రైతులు నిరసన చేపట్టే వేదికకు దగ్గర్లోనే ఈ హత్య జరిగింది. హత్యకు గురైన వ్యక్తిని లాఖ్‌బీర్‌సింగ్‌ గా పోలీసులు గుర్తించారు. వేదిక  దగ్గర ఉన్న ఓ బారికేడ్‌కు.. లాఖ్‌బీర్‌ మృతదేహం వేలాడేశారు. అయితే ఈ హత్యతో రైతు ఉద్యమం ఒక్కసారిగా మతం రంగు పులుముకుంటోంది. ఎందుకంటే.. చనిపోయిన వ్యక్తి తమ మత గ్రంథాన్ని అపవిత్రం చేశాడని నిహాంగాల బృందం చెబుతోంది.

ఈ హత్య చేసింది తానే అని ఓ వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు కూడా. అయితే ఇప్పుడు ఈ హత్యపై రాజకీయం మొదలైంది. ఇది కాస్తా రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. రైతులు నిరసన తెలుపుతున్నప్రాంతంలో హత్య జరిగింది కాబట్టి ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఈ హత్య ద్వారా రైతులపై హంతకులన్న ముద్ర వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విమర్శలు కూడా వస్తున్నాయి.

రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతంలో పరిస్థితులు బాగా లేవని ప్రచారం చేసే ఉద్దేశంలో భాగంగానే ఈ దారుణం జరిగిందన్న విమర్శలు వస్తున్నాయి. అయితే బీజేపీ ఈ ఆరోపణలను తిప్పి కొడుతోంది.  రైతుల పేరుతో జరుగుతున్న ఈ నిరసనల వెనుక అరాచకాలు జరుగుతున్నాయని బీజేపీ ఐటీ సెల్ చెబుతోంది. రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా ఈ హత్యను  ఖండించింది. తమ ఉద్యమానికి మతం రంగు పులి మేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: