నేను చెప్పాను.. కేసీఆర్‌ చేశారు..ఆలోచించుకోండన్న ఈటల..?

Chakravarthi Kalyan
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. సొంత స్థానం నిలబెట్టుకునేందుకు ఈటల రాజేందర్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ప్రచారం జోరు పెంచారు. జమ్మికుంటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్ అంబేద్కర్ కాలనీలో పర్యటించారు. తన  సొమ్ము తిన్న నాయకులు కూడా నన్ను వదిలిపెట్టిపోయినా.. ప్రజలంతా నా వెంట ఉన్నందుకు దండం పెడుతున్నానన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఎంతగా కొట్లాడారో... తాను,  హరీశ్ రావు కూడా అంతే కొట్లాడామన్న ఈటల.. తాను మధ్యలో వచ్చి మధ్యలో పోయానని చెప్పడం బాధిస్తోందన్నారు.


హుజూరాబాద్ కు ఏ స్కీం వచ్చినా.. అది తన వల్లనే వచ్చాయన్న ఈటల.. ఓట్ల కోసమే కేసీఆర్ దళిత బంధు తెచ్చారన్నారు. నిజంగా కేసీఆర్‌కు దళితుల మీద ప్రేమ ఉంటే మూడెకరాల పథకం ఎందుకు  అమలు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ దళితులకు ఇస్తానన్న  
ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోగా.. అవమానకర రీతిలో ఉపమఖ్యమంత్రులను పదవి నుంచి పీకేశారని ఈటల రాజేందర్ గుర్తు చేశారు.


రాష్ట్ర జనాభాలో 17 శాతం ఉన్న ఎస్సీలకు 3,4 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటే.. కేవలం ఒక్కరికిచ్చి  కేసీఆర్ చేతులు దులుపుకున్నాడని విమర్శించారు ఈటల రాజేందర్.. చివరకు
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఐపీఎస్ అధికారి కూడా అవమానాలు భరించలేక రాజీనామా చేశారని అంటున్నారు ఈటల రాజేందర్. తాను డిమాండ్ చేస్తేనే.. మొదటి సారిగా సీఎంవోలో ఇటీవలే ఓ దళిత అధికారిని పెట్టారని ఈటల గుర్తు చేసుకున్నారు.


తాను ఏది డిమాండ్ చేసినా.. దానికి స్పందన వస్తోందన్న ఈటల.. 30న జరిగే ఎన్నికల్లో ఈటలను కాపాడుకుంటామన  ప్రజలు చెబుతున్నారన్నారు. ఇది కేసీఆర్ అహంకారానికి, ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న పోటీగా ఈటల వర్ణించారు. డబ్బులిచ్చి నాపై ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారని.. అనేక రకాలుగా డబ్బులతో అవమాన పరుస్తున్నారని ఈటల అంటున్నారు. ఇప్పుడు తనపై విమర్శలు చేస్తున్నవాళ్లందరికీ  తాను గతంలో సహాయం చేసిన వాడినేనన్న ఈటల. తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను పేదలవైపే ఉంటానన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: