భూపాల్ పల్లి లో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సంధర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...తెలంగాణలో సింగరేణి కార్మికుల హక్కులను కేసీఆర్ కాలరాశారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సింగరేణిని బొందలగడ్డగా మార్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు. 1200 మంది అమరులైంది కేసీఆర్ కుటుంబం కోసమా...? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ నక్సలైట్ల ఎజెండా అన్నారు.. ఏమైంది..? అంటూ రేవంత్ ప్రశ్నలు కురిపించారు. కేసీఆర్ వేలకోట్లు దోచుకోమని నక్సలైట్ల ఎజెండాలో ఉందా అంటూ రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ కోసం కొట్లాడిన యువకులు ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఎంతో నష్టపోయినా కూడా తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పార్లమెంటు తలుపులు మూసి, లైవ్ లు కట్ చేసి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి గౌరవం దక్కించాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గుండెల్లో పెట్టుకున్న మిమ్మల్ని గుండెలపై తన్ని గండ్ర వెంకటరమణారెడ్డి కేసీఆర్ కాళ్ల దగ్గరకు వెళ్లాడని రేవంత్ వ్యాఖ్యానించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఓకబ్జా కోరు అంటూ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు మా కార్యకర్తలను వేధిస్తే వారి పేర్లను డైరీలో రాసుకుని గుర్తుపెట్టుకుంటామంటూ రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దారివెంట ఎక్కడ చూసినా కాంగ్రెస్ కార్యకర్తల కళ్ళల్లో ఆనందం కన్పించిందంటూ రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా పీసీసీ పగ్గాలను చేపట్టిన తరవాత కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ కార్యకర్తలకు దగ్గర అవుతున్నారు. అంతే కాకుండా కేసీఆర్ ప్రభుత్వం పై రేవంత్ రెడ్డి విమర్శలు కురిపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి వెళుతున్న సభలకు కూడా భారీగా జనాలు కనిపించడంతో రాష్ట్ర కాంగ్రెస్ లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది.