సినీ ఇండస్ట్రీలో పవన్ ని ఒంటరి చేస్తున్నారా..?
పవన్ కల్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమాతో తాము సక్సెస్ అయ్యామని, అప్పటినుంచి ఆయనతో సినిమా తీయాలనే కల తనకు ఉందని చెప్పేవారు దిల్ రాజు. వకీల్ సాబ్ సినిమాకోసం పవన్ ని ఒప్పించేందుకు ఆయన చాలా ప్రయత్నాలు చేశారు కూడా. రెమ్యునరేషన్ విషయంలో పవన్ అడిగినంతా ఇచ్చేశారని టాక్. అలాంటి దిల్ రాజు సైతం ఇప్పుడు మంత్రి పేర్ని నాని వద్దకు వచ్చేశారు. రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ స్టేజ్ పై పొలిటికల్ సెటైర్లు వేస్తుంటే, కింద ఉన్న దిల్ రాజు కాసేపు నవ్వుకున్నారు. ఆ నవ్వులే ఆయన కొంప ముంచేలా కనిపించాయి. అనుకున్నట్టుగానే మంత్రి పేర్ని నాని.. ఆ తర్వాత మీడియా సమావేశంలో దిల్ రాజు పేరు ప్రస్తావించారు. దీంతో అసలుకే మోసం వస్తుందనుకున్న నిర్మాత రాజు.. వెంటనే ఏపీకి వచ్చేశారు, మంత్రితో మంతనాలు జరిపారు. సినీ ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం ఫుల్ సపోర్ట్ ఇస్తుందని చెప్పేశారు.
ఒక్క దిల్ రాజు మాత్రమే కాదు.. ప్రస్తుతం పవన్ తో సినిమాలు చేస్తున్న నిర్మాతలది కూడా ఇదే పరిస్థితి. పవన్ సినిమాలతో తమను ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందేమోనన్న అనుమానం వారిలో ఉంది. ఇంతవరకు ఓకే.. ఇకపై పవన్ తో సినిమాలు చేయాలనుకుంటున్నవారి సంగతేంటి..? పవన్ నేరుగా పొలిటికల్ కామెంట్స్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంటే.. నిర్మాతలు ఎవరికి చెప్పుకోవాలి..? ఎంతవరకు మథనపడాలి..? వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా ఆటోమేటిక్ గా ప్రభుత్వంతో సఖ్యత కోరుకునేవారెవరైనా పవన్ కి దూరంగా ఉండాలనే అనుకుంటున్నారు. అంటే ఫైనల్ గా ఇండస్ట్రీలో పవన్ ఒంటరివాడయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.