గ్లాసులో వాడిపోయిన కమలం..సైకిల్‌తో సెట్...
బిజేపిని వెనుకేసుకుని తిరగడం వల్ల జనసేనకు క్రిస్టియన్, మైనారిటీ ఓటింగ్ బాగా దూరమైనట్లు కనిపిస్తోంది. పవన్ మీద అభిమానం ఉన్నా సరే వారు...బిజేపి వల్ల జనసేనకు మద్ధతు ఇవ్వడం లేదని తెలుస్తోంది. అసలు పంచాయితీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో బిజేపి వల్ల జనసేనకే బాగా డ్యామేజ్ జరిగినట్లు కనిపిస్తోంది.
అందుకే ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో జనసేన కాస్త రూట్ మార్చింది. తాము బలంగా ఉన్న పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని కొన్ని మండలాల్లో టిడిపితో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లింది. దాని వల్ల కొన్ని మండలాల్లో ఈ రెండు పార్టీ బాగానే సత్తా చాటాయి. ఇక ఇప్పుడు ఎంపీపీల విషయంలో కూడా టిడిపి-జనసేనలు కలిసికట్టుగా ముందుకెళ్ళాయి. తూర్పుగోదావరి జిల్లా కడియం, పి. గన్నవరం, ఆలమూరు, రాజోలు, వి.ఆర్. పురం, పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం, ఆచంట మండలాల్లో టిడిపి-జనసేనల పొత్తు పెట్టుకుని సత్తా చాటాయి.
అయితే దీనికి పవన్ కల్యాణ్ సపోర్ట్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది. టిడిపితో పొత్తు పెట్టుకునే ఎంపీపీలు గెలుచుకుంటున్నామని తెలిసి పవన్...వైసీపీపై పోరాటం షురూ చేశారు. తమ అభ్యర్ధులని లాక్కోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదురుకుంటారని వార్నింగ్ ఇచ్చారు. అంటే టిడిపికి పవన్ పచ్చ జెండా ఊపి...కాషాయ పార్టీని సైడ్ చేసినట్లు కనిపిస్తోంది.
అసలు ఈ పొత్తుపై బిజేపి ఏ విధంగానూ మాట్లాడలేకపోతుంది. ఎందుకంటే బిజేపికి కొన్నిచోట్ల మద్ధతు ఇచ్చిన సరే సత్తా చాటలేకపోయింది. ఈ విషయాన్ని పవన్ ఓపెన్‌గానే చెబుతున్నారు. మొత్తానికి చూసుకుంటే కమలం పువ్వు టీ గ్లాసులో వాడిపోయినట్లే కనిపిస్తోంది. ఇక గ్లాసు...సైకిల్‌తో సవారీ చేయడమే తరువాయి.