ఏపీలో మళ్లీ పీకే పాలి'ట్రిక్స్‌'!?

N.Hari
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ బృందం చేసిన కృషి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఆయన బృందం వ్యవహరించిన తీరు ఇప్పటికీ రాష్ట్ర ప్రజల మదిలో మెదులుతుంది. జగన్ పాదయాత్ర, నవరత్నాలు, ఎన్నికల మ్యానిఫెస్టో రూపకల్పన, కులాలు, మతాలు, ఆర్ధిక అసమానతలు, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ప్రశాంత్ కిషోర్ బృందం పన్నిన వ్యూహాలు వైసీపీకి కలిసి వచ్చాయి. అభ్యర్దుల ఎంపిక వద్ద నుంచి క్షేత్రస్థాయి సర్వేలను కూడా ఈ బృందం నిర్వహించింది. చివరకు పార్టీ ప్రచార వ్యూహాన్ని కూడా ఈ బృందమే శాసించింది. ఐఐటీ నుంచి బయటకు వచ్చిన వారిని తాత్కాలికంగా ఎంపిక చేసుకుని అనుసరించాల్సిన వ్యూహాలు అప్పట్లో విజయవంతం అయ్యాయి. అప్పటి నుంచి కూడా ప్రశాంత్‌ కిషోర్‌ బృందం జగన్‌మోహన్‌రెడ్డితో టచ్‌లో ఉంది. చివరకు ఆ బృందంలోని కీలక సభ్యుడి వివాహం ఉత్తర ప్రదేశ్‌లో జరిగితే.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సతీసమేతంగా అక్కడకు వెళ్లి వచ్చారు. ఐదు నెలల క్రితం జగన్‌మోహన్‌రెడ్డిని ప్రశాంత్‌ కిషోర్‌ వచ్చి సుమారు రోజంతా కలిసి మాట్లాడారు. ఎన్నికల తర్వాత కూడా వీరి మధ్య బంధం కొనసాగుతూనే ఉంది.
ఇదిలావుంటే, ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నోట అటు క్యాబినెట్ సహచరులతోనూ, ఇటు మంత్రివర్గ సమావేశంలో కూడా ప్రశాంత్‌ కిషోర్‌ ప్రస్తావన చేశారని విశ్వనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రశాంత్‌ కిషోర్‌ బృందం సర్వే చేస్తుందని, అందరూ ఎన్నికల క్యాంపెయిన్ వైపు షిప్ట్ కావాలని ముఖ్యమంత్రి తాజాగా జరిగిన క్యాబినేట్ సమావేశంలో మంత్రులకు హిత బోధ చేశారట. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ప్రశాంత్‌ కిషోర్‌ బృందం సర్వే చేస్తుందని నిర్మొహమాటంగా చెప్పారట. మనం ఎక్కడ ఉన్నామో కూడా తెలుసుకుందామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడంతో ఇప్పుడు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలలో కలకలం ప్రారంభమైంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే- తాజాగా పీకే బృందం ఇటీవల అంటే నెల రోజుల క్రితం ముంబయి ఐఐటీకి వెళ్లి తమకు సుమారు 150 మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారు కావాలని, వారిని తాము రిక్రూట్ చేసుకుంటామని ప్రిన్సిపాల్‌తో మాట్లాడారట. ఆకర్షణీయమైన వేతనాలు, నెలకు లక్షన్నరకు తగ్గకుండా ఇస్తామని కూడా చెప్పారట. అవసరమైతే మరో 150 మందిని వేరే ఐఐటీల నుంచి తీసుకుంటామని సాక్షాత్తు ప్రశాంత్‌ కిషోర్‌ టీములో కీలకంగా ఉన్న వ్యక్తి రిక్రూట్ మెంట్‌కు సిద్ధపడినట్లు సమాచారం. మొత్తంమీద ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలోకి మళ్లీ ప్రశాంత్‌ కిషోర్‌ రీఎంట్రీ ఇవ్వబోతున్నారన్న సంకేతాలు అయితే స్పష్టమయ్యాయి. మరి పీకే పునరాగమనం ఎప్పుడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: