చంద్రబాబును వదిలేది లేదంటున్న రేవంత్ రెడ్డి..?
ఇంకా తెలుగు దేశంలో ఉంటే రాజకీయ భవితవ్యం ఉండదని భావించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చారు. వచ్చే ముందు.. చంద్రబాబు ఆశీస్సులు తీసుకునే వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాజీ తెలుగు దేశం నేత మాత్రమే.. ప్రస్తుతం ఆయన ఏకంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు.. అయితే.. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి తెలంగాణకు ఏమాత్రం ఇష్టం లేని చంద్రబాబు పేరును ఎత్తడానికి సందేహ పడతారు. ఇంకా చంద్రబాబుపై ప్రేమ చూపితే బావుండదనుకుంటారు.
కానీ.. రేవంత్ రెడ్డి రూటే సెపరేటు.. ఆయన ఇప్పటికీ చంద్రబాబుపై ప్రేమను వదులుకోరు. దాన్ని ప్రదర్శించేందుకు కూడా వెనుకాడరు. టీడీపీ అధినేత చంద్రబాబు పట్ల తనకు ఉన్న అభిమానాన్ని తాజాగా రేవంత్ రెడ్డి మరోసారి చాటుకున్నారు. తెలంగాణ ప్రజల కోసమే తాను తెలుగుదేశం పార్టీని వీడానని చెబుతున్నారు. తెలంగాణ బిడ్డలు, రైతులు పడుతున్న కష్టాలను చంద్రబాబుకు వివరించి గౌరవంగా పార్టీని వీడానని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకుంటున్నారు.
తాను సొంత లాభం పొందాలని అనుకుంటే తెలుగు దేశం నుంచి టీఆర్ఎస్లోకి వెళ్తాను తప్ప.. కాంగ్రెస్లోకి ఎందుకు వస్తానని ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా ప్రతిపక్ష కాంగ్రెస్ లో చేరతారా అని ఆయన ప్రశ్నించారు. హైటెక్ సిటీని అభివృద్ది చేసింది చంద్రబాబేనని గతంలో పొగిడింది టిఆర్ఎస్ వారేనని రేవంత్ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబును తిట్టవలసిన అవసరం ఏముందని రేవంత్ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదని.. రాజకీయ విలువలను గౌరవిస్తూ తాను చంద్రబాబును తిట్టలేదని రేవంత్ పాత అభిమానాన్ని కురిపిస్తున్నారు. మొత్తానికి తాను చంద్రబాబును వదిలేదిలేదని రేవంత్ చెప్పకనే చెప్పారన్నమాట.