తెలుగును బతికిద్దాం.. తెలుగోడిగా గర్విద్దాం..!
మాతృభాషలేనిదే మనిషికి మనుగడ లేదని అన్నారు సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ. దక్షిణాఫ్రికా తెలుగు సంఘం ఏర్పాటు చేసిన భాషా సదస్సులో ఆయన మాట్లాడారు. తెలుగు రక్షణకు భాషా శాస్త్రవేత్తలు ఉద్యమస్థాయిలో పనిచేయాలని.. అమ్మభాష మాట్లాడటాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. ఇంగ్లీష్ భాష మోజులో తెలుగును నిర్లక్ష్యం చేయడం తగదని జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. గిడుగు 158వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళుర్పించారు.
తెలుగు, సంస్కృతానికి తేడా తెలియని వైసీపీ పాలనలో గిడుగు రామ్మూర్తి ఆకాంక్షలు నెరవేరడం లేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. బోధనా భాషగా ఉన్నప్పుడే ఏ భాషకైనా మరింత రాణింపు ఉంటుందన్నారు. తెలుగును నాశనం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆరోపించారు. అటు గిడుగు కృషి వల్లే ఆ కాలంలో కొద్దిమందికైనా పరిమితమైన చదువు, రచన వాడుక భాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చాయని లోకేశ్ అన్నారు.
తెలుగు భాషను బతికిద్దాం.. తెలుగువారిగా జీవిద్దాం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ పిలుపునిచ్చారు. తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు పట్ల పాలకులు అనాలోచిత చర్యలకు ఉఫక్రమిస్తున్నారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయింది.. అనే రీతిలో వ్యవహరిస్తున్నారనీ.. మాతృభాషలోనే సంస్కృతి సంప్రదాయాలు పరిఢవిల్లుతాయన్నారు. తెలుగు భాషా పరిరక్షణకు జనసేన తనవంతు కృషి చేస్తోందన్నారు పవన్ కళ్యాణ్.
ఇక ఏపీలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తపాలాశాఖ రూపొందించిన ప్రత్యేక కవర్ ను మంత్రి ఆవిష్కరించారు. ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినా తెలుగును ఖచ్చితంగా బోధించాలని స్పష్టం చేశారు. తెలుగుకు సంబంధించిన ప్రత్యేక కోర్సులు, డిగ్రీలను తీసుకురానున్నట్టు వెల్లడించారు.