హుజూరాబాద్‌లో గెలిచిన ఈటల రాజేందర్‌..?

Chakravarthi Kalyan
అదేంటి.. హుజూరాబాద్ ఎన్నికే జరగలేదు.. అప్పుడే ఈటల రాజేందర్ గెలిచాడని రాయడమేంటి అనుకుంటున్నారా.. అవును.. వాస్తవానికి ఇంకా హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాలేదు. నోటిఫికేషన్ రావాలి.. నామినేషన్లు వేయాలి.. పోలింగ్ జరగాలి.. కౌంటింగ్ జరగాలి.. అప్పుడే హుజూరాబాద్ విజేత ఎవరో తెలిసేది.. కానీ.. ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలు చూస్తే.. ఇప్పటికే ఈటల రాజేందర్ నైతికంగా గెలిచారని చెప్పక తప్పదు. ఎందుకంటే.. కేసీఆర్‌ను తెలంగాణ వచ్చిన తర్వాత ఇంతగా ఇరుకున పెట్టిన  నాయకుడు ఇంకొకరు లేరని చెప్పాలి.


అవును.. హుజూరాబాద్ ఉప ఎన్నికను కేసీఆర్ కోరి తెచ్చుకున్నారు. ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ను స్వయంగా అవినీతి ముద్ర వేసి బయటకు పంపారు. ఆ సమయంలోనే ఈటలపై సానుభూతి లభించింది. ఈటల కంటే ఎక్కువగా కుంభకోణాలు బయటపడిన మంత్రులు కూడా ఇంకా మంత్రివర్గంలోనే ఉన్నా.. కేవలం అసైన్డ్‌ భూముల కొనుగోలు సాకుతో ఈటలపై అవినీతి ముద్ర వేసి సాగనంపడం ఈటలపై సానుభూతి పెరిగేలా చేసింది.


ఇక హుజూరాబాద్‌లో గెలిచేందుకు కేసీఆర్ టీమ్ చేస్తున్న ప్రయత్నాలు చూస్తే.. ఈటల నైతికంగా గెలిచాడని ఎందుకు అంటున్నామో అర్థం అవుతుంది.  నిన్నటి వరకు తనతో కలిసి నడిచిన ఈటల ఓటమికి కేసీఆర్‌ నానా హైరానా పడుతున్నట్టు కనిపిస్తోంది. జిల్లా యంత్రాంగం అంతా హుజూరాబాద్‌లో తిష్ట వేసి టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం ప్రయత్నిస్తోంది. ఇక హరీశ్ రావు నేతృత్వంలోని పార్టీ బృందం కూడా ఇప్పటికే ప్రచారం ఉధృతం చేసి హంగామా చేస్తోంది.


కేసీఆర్ ఇటీవల ప్రకటించిన దళిత బంధు కూడా ఈటల రాజేందర్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రకటించిందే.. ఒక్క హుజూరాబాద్‌లోనే దీన్ని ప్రస్తుతం అమలు చేస్తున్నారు. ఇవి కాకుండా ఇతర బీసీలకు అనేక పథకాల ద్వారా లబ్ది చేకూ రుస్తున్నారు. ఇదంతా చూస్తుంటే... ఇప్పటికే ఈటల రాజేందర్ నైతికంగా గెలిచారనడంలో తప్పేముంది..? కాదంటారా.. అవునంటారా..?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: