ఆదిరెడ్డి ఫ్యామిలీ ‘సైకిల్’కి డ్యామేజ్ చేస్తుందా?
అయితే బుచ్చయ్య ఇంత ఆవేదనతో మాట్లాడటానికి అసలు కారణం ఆదిరెడ్డి ఫ్యామిలీనే అని తెలుస్తోంది. గతంలో బుచ్చయ్య రాజమండ్రి సిటీ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2014 ఎన్నికల్లో చంద్రబాబు, పొత్తులో భాగంగా రాజమండ్రి సిటీని బీజేపీకి కేటాయించి బుచ్చయ్యని రాజమండ్రి రూరల్‌కు పంపించారు. అయితే ఇష్టం లేకపోయినా సరే బుచ్చయ్య రూరల్ నుంచే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక అక్కడే సెటిల్ అయిపోయారు. అలా అని సిటీ నియోజకవర్గంలో పెద్దగా తలదూర్చడం లేదని అంటున్నారు. కాకపోతే అనేక సంవత్సరాలు సిటీలో పనిచేశారు కాబట్టి, అక్కడ బుచ్చయ్య అనుచరులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇక వారికి ఆదిరెడ్డి ఫ్యామిలీ ప్రాధాన్యత ఇవ్వడం లేదని బుచ్చయ్య మాట్లాడుతున్నారు.
సిటీలో దివంగత ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవాని ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన భర్త శ్రీనివాస్, మామ అప్పారావులు సిటీలో పెత్తనం చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఆదిరెడ్డి ఫ్యామిలీ బుచ్చయ్య అనుచరులని పార్టీ నుంచి తరిమే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే పలువురు పార్టీని వీడారని తెలుస్తోంది. ఇలా జరుగుతూ పోతే రాజమండ్రిలో పార్టీకే డ్యామేజ్ జరుగుతుందని బుచ్చయ్య అంటున్నారు. ఆ విషయం అధినేత దృష్టికి తీసుకెళ్లినా సరే పట్టించుకోలేదని, అందుకే తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. మొత్తానికి చూస్తే సిటీలో ఆదిరెడ్డి ఫ్యామిలీ పార్టీకి డ్యామేజ్ చేస్తుందని బుచ్చయ్య ఆవేదన పడుతున్నారు.