బైక్ లపై మోజు, ట్రాక్టర్లంటే రోత.. కరోనా తర్వాత కీలక మార్పులు..
సెకండ్ వేవ్ క్రమంగా కనుమరుగవుతున్న ఆ సమయంలో.. జులై నెలలో రికార్డు స్థాయిలో వాహనాల విక్రయాలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది జులైలో దేశవ్యాప్తంగా 11.6లక్షల వాహనాలు అమ్ముడు కాగా.. ఈ ఏడాది జులైలో 15.5లక్షల వాహనాలు అమ్ముడయ్యాయు. వాహనాల రిజిస్ట్రేషన్లలో వార్షిక ప్రాతిపదికన 34.12 శాతం పెరుగుదల కనిపిస్తోంది. ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాలతోపాటు అన్ని విభాగాల్లోనూ గణనీయంగా పెరుగుదల ఉండటం విశేషం.
దేశవ్యాప్తంగా టూవీలర్స్ కొనుగోళ్లు జోరుగా ఉన్నాయి. ఓ మోస్తరు ఆదాయం ఉన్నవారు కార్లవైపు చూస్తుంటే.. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు బైక్ ల వైపు చూస్తున్నాయి. జులై నెలలో టూవీలర్క్ కొనుగోళ్లలో విపరీతమైన పెరుగుదల ఉందని చెబుతున్నారు. 2021 జులైలో 11.3 లక్షల బైకులు అమ్ముడయ్యాయి. గతేడాది కేవలం 8.8లక్షల బైకులు మాత్రమే అమ్ముడు కావడం విశేషం. అమ్మకాల్లో పెరుగుదల 27.56శాతంగా ఉంది.
మందగించిన ట్రాక్టర్ల కొనుగోళ్లు.
టూ వీలర్స్ కొనుగోళ్లలో విపరీతమైన పెరుగుదల కనిపిస్తుండగా.. ట్రాక్టర్ల కొనుగోళ్లలో మాత్రం ఆ స్థాయిలో పెరుగుదల లేదు. ట్రాక్టర్ల కొనుగోళ్లలో వృద్ధిరేటు కేవలం 6.64 శాతంగా ఉండటం విశేషం. దేశవ్యాప్తంగా ట్రాక్టర్ల కొనుగోళ్లు పూర్తిగా మందగించాయని చెబుతున్నాయి కంపెనీలు. అదే సమయంలో టూవీలర్స్ పై మాత్రం జనం విపరీతమైన ఆసక్తి చూపించడం విశేషం.