ఓనమ్ కి వెసులుబాట్లు.. కేరళ సర్కారుకి చీవాట్లు

Deekshitha Reddy
కేరళ సర్కారు మరో సంచల నిర్ణయం తీసుకుంది. ఓవైపు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్న ఈ సందర్భంలో ఓనమ్ పండగకోసం ఆంక్షలు సడలించింది. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 గంటలనుంచి రాత్రి 9 గంటల వరకు అన్ని షాపులు తెరచి ఉంచేలా కొత్తగా ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలు ఈరోజునుంచి అమలులోకి వస్తున్నాయి. ఓనమ్ పండగ ఈనెల 12నుంచి 23వరకు సంప్రదాయ బద్ధంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో షాపింగ్ అవసరాలు, ఇతర కార్యక్రమాలకోసం వారం రోజుల ముందుగానే కొవిడ్ ఆంక్షలు సడలించింది కేరళ సర్కారు.



 గతంలో బక్రీద్ సందర్భంగా ఇలాగే ఆంక్షలు సడలించి సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురైంది కేరళ ప్రభుత్వం. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై కేరళకు సూచనలిచ్చింది. పండగల వేళ ఆంక్షలు సడలిస్తే కొవిడ్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశముందని చెప్పింది. అయితే సీఎం పినరయి విజయన్ మాత్రం ఇవేవీ లెక్కచేయలేదు. కొవిడ్ ఆంక్షలు సడలించారు. ఫలితంగా కేరళలో కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. రోజువారీ కేసులు 20వేలకు తగ్గనంటున్నాయి. మొత్తం కేరళలో 1.7లక్షల యాక్టివ్ కేసులు ఉండటం గమనార్హం. అంతేకాదు, భారత్ లో కొత్తగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో 50శాతం కేరళలోనే వెలుగు చూస్తున్నాయి.

ఒకరకంగా కేరళ ఇప్పుడు థర్డ్ వేవ్ కి హాట్ స్పాట్ గా మారింది. దీంతో పొరుగు రాష్ట్రం తమిళనాడు కూడా అప్రమత్తమైంది, సరిహద్దుల్లో ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. అటు కేరళ మాత్రం ఇవేవీ పట్టనట్టు వ్యవహరించడం ఇప్పుడు సంచలనంగా మారింది. కేరళలో ఓనమ్ పండగకి వెసులుబాట్లు ఇస్తూ ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఓనమ్ వెసులుబాట్లతో కేరళలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందనే అంచనాలున్నాయి. ఇటీవలే కేంద్ర బృందం కేరళలో పర్యటించి కేసులు తగ్గడానికి మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర బృందం అలా రాష్ట్రం దాటి వెళ్లిందో లేదో, ఇటు ప్రభుత్వం ఓనమ్ పండగకి కర్ఫ్యూ నిబంధనలు సడలించింది. కేసులు పెరుగుతున్నా, కళ్లముందే అనర్థం జరుగుతున్నా పినరయి విజయన్ సర్కారు మాత్రం డోంట్ కేర్ అంటోంది. ప్రజల్ని మరింతగా కరోనా కోరల్లోకి నెట్టేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: