టోక్యో ఒలింపిక్స్: చుక్కలు చూపిస్తున్న సూర్యుడు..?
ఒలింపిక్స్ బరిలో సూర్యుడేమిటనుకుంటున్నారా.. అవును మరి ఇప్పుడు టోక్యోలో ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎన్ని ఏర్పాట్లు చేసినా.. ఆటగాళ్లు ఆ ఎండకు తట్టుకోలేకపోతున్నారట. తాజాగా అధిక వేడిమి కారణంగా ఓ రష్యన్ ఆర్చర్ మైదానంలోనే కుప్పకూలాడు కూడా. దీంతో ఆటగాళ్లు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఎండలేంట్రా బాబోయ్ అంటూ తలపట్టుకుంటున్నారు. ఈ ఎండలతో నేను మరణిస్తే ఎవరూ కారణమంటూ టెన్సిస్ స్టార్ డేనియల్ మెద్వెదేవ్ ప్రశ్నించాడంటే తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
టోక్యోలోని అధిక ఉష్ణోగ్రతలకు క్రీడాకారులు త్వరగా డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. టోక్యోలో ఇప్పడు యావరేజ్‌గా 32డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. అయితే వాతావరణంలో తేమ కారణంగా ఈ ఎండల తీవ్రత 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతగా ఆటగాళ్లు ఫీలవుతున్నారు. చాలా దేశాల్లో ఇది చాలా తీవ్రమైన ఎండ.. చాలా మంది క్రీడాకారులు ఇంతటి ఉష్ణోగ్రతలు తట్టుకోలేరు.
ఈ పోటీల్లో పాల్గొంటున్న చాలా మంది క్రీడాకారులు ఈ ఎండకు తట్టుకోలేక ఆటలో చాలాసార్లు విశ్రాంతి తీసుకుంటున్నారట. అయితే ఈ ఉష్ణోగ్రతల నుంచి క్రీడాకారులకు ఉపశమనం కల్పించేందుకు నిర్వాహకులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ స్థాయిలో ఏసీలు పెట్టారు. అయినా పతకాల సంగతి తర్వాత ముందు ప్రాణాలు దక్కితే అదే పదివేలని క్రీడాకారులు అంటున్నారంటే.. టోక్యో ఎండలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.