‘జై హింద్, జై సింధ్’ నుంచి తొలి పాట వచ్చేసింది.. మెలోడియస్‌ సాంగ్ 'రుబారు'కు ఫాన్స్ ఫుల్ ఫిదా!

Reddy P Rajasekhar
విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ‘జై హింద్, జై సింధ్: ఎ లవ్ స్టోరీ’ సినిమాపై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. కథ, నటీనటుల ఎంపిక నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమా మ్యూజికల్ జర్నీ మొదలైంది. ఇందులో భాగంగా చిత్రంలోని తొలి పాట ‘రుబారు’ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ పాటలో హీరో హీరోయిన్స్ గౌరవ్ ధింగ్రా, అకైషా వాత్స్ మధ్య ప్రేమ, అనుబంధం ఎంతో అద్భుతంగా ఉంది.

మంచుతో కప్పుకున్న అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య తెరకెక్కిన ‘రుబారు’ పాట ప్రేమలో పడే సమయంలో కలిగే ఆనందం, అమాయకత్వం, మధురమైన అనుభూతులను ప్రతిబింబిస్తోంది. ఈ పాటకు జె. అనూప్ సీలిన్ సంగీతం అందించగా.. ప్రముఖ గేయ రచయిత కుమార్ సాహిత్యం అందించారు. ఎండీ ఇర్ఫాన్, శివానీ శర్మ ఆలపించిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హృదయాన్ని తాకే సాహిత్యానికి ప్రశాంతమైన రొమాంటిక్ ట్యూన్ జత కావడంతో ‘రుబారు’ సినిమాకు మంచి మ్యూజికల్ ఓపెనింగ్‌గా నిలిచింది.

ఈ సందర్భంగా నిర్మాత సామీ నాన్వానీ మాట్లాడుతూ.. ‘రుబారు’ పాట విడుదల తమ కొత్త మ్యూజిక్ లేబుల్ ‘సామీస్ మ్యూజిక్’ నుంచి వచ్చిన తొలి మ్యూజికల్ ఆఫరింగ్ అని తెలిపారు. మెలోడీ, భావోద్వేగం, ఎప్పటికీ గుర్తుండిపోయే కథలను ప్రోత్సహించే ఉద్దేశంతో తమ లేబుల్‌ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ తెరకెక్కిస్తున్న జై హింద్, జై సింధ్ కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా.. ప్రేమ, వ్యక్తిత్వం, బంధాలు, మూలాలు, కుటుంబం చుట్టూ సాగే కథగా రూపొందుతోంది. మహేశ్ మంజ్రేకర్, జయప్రద, ఛాయా కదమ్, రాహుల్ దేవ్, విక్రమ్ కొచర్, జరీనా వహాబ్, అమిత్ బెహల్, ఇంద్రా తివారీ, ఉపాసనా సింగ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. గౌరవ్ ధింగ్రా, అకైషా వాత్స్ ఈ సినిమాతో హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హిందీతో పాటు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లోనూ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: