తెలుగు రాష్ట్రాలు ఖుషీ ఖుషీ.. ఈ ఏడాది ఆ కష్టాలు తీరినట్టే...?

Chakravarthi Kalyan
నీరున్నచోటే నాగరికత పరిఢవిల్లింది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఆధునిక కాలంలోనూ జలమే అభివృద్ధికి ఆయువుపట్టుగా ఉంటోంది. తాగునీటి అవసరాలు తీర్చాలన్నా.. సాగు సజావుగా సాగాలన్నా.. విద్యుత్ వెలుగులు విరజిమ్మాలన్నా నదీజలాలు కావాల్సిందే. అందుకే కృష్ణా జలాల కోసం రాష్ట్రాల మధ్య అంతగా పంచాయతీ. అయితే.. భారీ వర్షాలతో ఎగువ నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది నీటి కష్టాలు తీరినట్టే కనిపిస్తోంది.  

ఏపీ, తెలంగాణ మధ్య నీటి గొడవంతా కృష్ణా జలాలతోనే.. గోదావరిలో కావాల్సినంత నీరు ఉండటంతో పేచీ లేదు. అయితే ఈ ఏడాది శ్రీశైలం జలాశయానికి భారీగా నీరు వచ్చి చేరుతోంది. పై నుంచి ప్రవాహం వస్తున్న తీరు చూస్తే.. ఈ ఏడాది కూడా సాగు, తాగు నీటి కష్టాలు ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులోకి దాదాపు 3.70 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 860 అడుగుల వరకూ చేరుకుంది. ప్రస్తుతం శ్రీశైలంలో నీటి నిల్వ వంద టీఎంసీలకు చేరుకుంది.

జలవనరుల శాఖ గణాంకాల ప్రకారం ఇంకా శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే.. 115 టీఎంసీల వరకూ నీరు అవసరం అవుతుంది. ప్రస్తుతం ఎగువన ఉన్న కర్ణాటక నుంచి భారీగా వరద వస్తోంది. ఈ వరద మరో వారం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్‌ల్లోకి ఇంకా భారీగా వరద ప్రవాహం వస్తూనే ఉంది. అక్కడి నుంచి అన్ని గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. ఇక జూరాల ప్రాజెక్టు స్పిల్‌ వే గేట్లు ఎత్తేసి 3.7 లక్షల క్యూసెక్కుల నీరు పంపుతున్నారు. ఈ కృష్ణమ్మ జోరు చూస్తే వారం రోజుల్లో శ్రీశైలం పూర్తిగా నిండే అవకాశం కనిపిస్తోంది.


శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్‌ విద్యుదుత్పత్తి కొనసాగిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి తర్వాత దిగువకు నీరు విడుదల చేస్తోంది. అలా నాగార్జునసాగర్‌కు 30 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఇక రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల పరిధిలోని మూసీ ద్వారా పులిచింతలకు 14 వేల వరకూ క్యూసెక్కుల నీరు వస్తోంది. అలా మొత్తం మీద ప్రకాశం బ్యారేజీలోకి లక్ష వరకూ క్యూసెక్కుల నీరు వస్తోంది. అక్కడి నుంచి కృష్ణా డెల్టా కాలువలకు నీరు వదులుతూ మిగిలిన నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. దాదాపు లక్ష క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వెళ్తోందని చెబుతున్నారు. మొత్తానికి ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలకు నీటి కష్టాలు తీరినట్టే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: