
జగన్ ఆ నేతకు తెలివిగా చెక్ పెట్టేశారు..!
జూపూడిని జగన్ పార్టీలో చేర్చుకునేటప్పుడు ఆయనకు ఏదో పదవి ఇస్తానని అయితే హామీ ఇవ్వలేదు. అయితే అలాంటి వ్యక్తి మనకు ప్లస్ కాకపోయినా.. టీడీపీకి ప్లస్ కాకూడదనే జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పేశారు. ఇక వైసీపీలోకి జూపూడి రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ప్రకాశం జిల్లా రాజకీయాలు మారిపోయాయి. ఇక్కడ సుబ్బారెడ్డి వర్సెస్ బాలినేని పోరులో జూపూడి కొత్త రాజకీయం స్టార్ట్ చేశారు. ఎవరో ఒకరు తనకు ఎమ్మెల్సీ లేదా కొండపి ఇన్‌చార్జ్ పదవి ఇప్పిస్తారని ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ రెండు పదవులు కూడా జూపూడికి రాలేదు. చివరకు కొండపి వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న మాదాసి వెంకయ్యనే జగన్ కొనసాగించడంతో పాటు ఆయనకు ప్రతిష్టాత్మకమైన ప్రకాశం డీసీసీబీ చైర్మన్ పదవి కూడా కట్టబెట్టారు.
జూపూడి ఏ పదవి వస్తుందా ? అని ఎక్కడ వేయాల్సిన రాళ్లు అక్కడ వేస్తూనే ఉన్నారు. ఇక తాజా నామినేటెడ్ పదవుల భర్తీలో జగన్ ఆయనకు సామాజిక న్యాయ సలహాదారు పదవిని కేటాయించారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. జూపూడిని ఈ పదవితో సరిపెట్టేసుకోమని జగన్ హింట్ ఇచ్చేశారని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పార్టీ మారి తిరిగి పార్టీలోకి వచ్చారు... ఇంతకన్నా ఎక్కువ పదవి ఇవ్వలేం.. ఎమ్మెల్సీ ఇవ్వడం కుదరని జగన్ సంకేతాలు ఇచ్చేసినట్టే కనిపిస్తోంది.
ఇక ప్రకాశం జిల్లాలో మూడు రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిల్లో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కొండపి సీటు దక్కించుకోవాలని ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఈ లోగా ఎమ్మెల్సీ పదవి రాదా ? అని ఆ దిశగా కూడా ట్రయల్స్ వేస్తున్నారు. అయితే జగన్ ఆయనకు చిన్న నామినేటెడ్ పదవి ఇవ్వడం ద్వారా ఆ ఛాన్స్ నీకు లేదని చెప్పకనే చెప్పేశారు. ఇక జూపూడి ఈ పదవితోనే సరిపెట్టుకోవడం మినహా చేసేదేం లేదు.