మారుతున్న కాలంతోపాటు మన పద్దతులు అలవాట్లు కూడా మారుతున్నాయి. మన విద్యావిధానం కూడా కొత్త మెరుగులు దిద్దుకుంటోంది. గతంలో పబ్లిక్ పరీక్షలు అంటే ఎక్కడలేని భయం, చదివింది సమయానికి గుర్తొస్తుందా రాదా ?, వచ్చినా ఎంత వరకు రాయగలం, ఇలా ఎన్నో... కాపీ కొడితే డీబార్ భయం. అయితే ఇప్పుడు ఎటువంటి బాధ లేదు, నేరుగా పుస్తకం చూసి రాయండి అంటూ ఏకంగా గవర్నమెంట్ చెప్పేసింది. అయితే ఈ అంశంపై గత కొన్ని సంవత్సరాలుగా విద్యా శాఖలో చర్చలు జరుగుతుండగా ఇప్పుడు ఈ విధానం కేవలం పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకు మాత్రమే లభించింది. విద్యార్థులు హాయిగా పుస్తకాలు పక్కన పెట్టుకొని మరీ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలకు చూసి రాసేయొచ్చట. ఈ ఓపెన్ బుక్ విధానాన్ని రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కోర్సుల్లో విద్యా సంవత్సరం (2021-22) నుంచే అమలు చేయనుంది ప్రభుత్వం.
అయితే ఈ పద్దతి పట్ల విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది విద్యార్థులకు నిజంగా ఒక వరం లాంటిదే అయినా, కొందరు తల్లి తండ్రులు ఇప్పటివరకు అంతంత మాత్రం అయినా చదివిన పిల్లలు ఇలాంటి పద్ధతి రావడం వల్ల ఇకపై పుస్తకాలే పట్టరని, భవిష్యత్తుపై భయం లేకుండా...ఇతర వాటిపై దృష్టి కేంద్రీకరించి సమయాన్ని వృధా చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారట. ఇంకొందరు మాత్రం ఇది సరైన పద్ధతేనని ఇలాంటి విధానం రావడం చేత బాగా చదివే పిల్లలు అయితే ప్రశ్నను అర్థం చేసుకుని వెంటనే సరైన సమాధానం చూసి రాస్తారని, ఒకవేళ సాధారణ పిల్లలు అయినా కనీసం పాస్ మార్కులకు చూసి రాసుకోగలుగుతారని తద్వారా ఫెయిల్ అయ్యామని బాధతో ఆత్మహత్యకు పాల్పడే విద్యార్థులే ఉండరని భావిస్తున్నారు.
ఈ విధానం అన్ని రకాల విద్యార్హతలకు అనగా డిగ్రీ, ఇంటర్, ఇలా వీటన్నింటికీ సూచించే విధంగా మార్పులు చేస్తే మరీ మంచిదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నోతాన్ పరీక్ష విధానం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.