వాళ్లకు జగన్ బంపర్ ఆఫర్.. నెలకు రూ. 3000..?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటింటికీ రేషన్ సరఫరా చేసే వాహనాల లబ్దిదారులకు వాహన రుణంపై  సబ్సీడీ పెంచేశారు. ఇలా సబ్సిడీ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 60 శాతంగా ఉన్న రుణ సబ్సిడీని 90 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా పెరిగిన 30 శాతం సబ్సిడీని వివిధ కార్పోరేషన్ల ద్వారా బ్యాంకులకు నేరుగా ప్రభుత్వమే చెల్లింపులు జరుపుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.  


ఇలా లబ్దిదారులకు రుణ సబ్సిడీ పెంచడం వల్ల వారికి అదనంగా నెలకు 3 వేల రూపాయల మేర లబ్ది కలుగుతుందని  ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జగన్ సర్కారు ఇంటింటికీ రేషన్ సరఫరా చేసేందుకు వాహనాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రేషన్ అందుకునే వారు రేషన్ దుకాణానికి కూడా వచ్చే అవసరం లేకుండా ప్రజల ఇంటి వద్దకే రేషన్ వచ్చేలా చేయాలని జగన్ ప్రభుత్వం ఈ వాహనాలను ఏర్పాటు చేసింది.


ఈ వాహనాల కోసం కొందరు లబ్ది దారులను ఎంపిక చేసి వారికి రుణాలపై వాహనాలు ఇప్పించింది. అయితే కాన్సెప్టు బాగానే ఉన్నా... ఈ వాహనాల ద్వారా తమకు గిట్టుబాటు కావడం లేదని వాహనాల యజమానులు కొన్నాళ్లుగా ఆందోళన చెందుతున్నారు. కొన్నిసార్లు ఏకంగా వాహనాలను అధికారులకు అప్పగించేసి వెళ్లిపోయారు కూడా. క్రమంగా ఈ వ్యవహారం అధికారులకు తలనొప్పిగా మారింది. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం కావడంతో అధికారులు ఏం చేయాలో అర్థంకాక జట్టుపీక్కున్నారు.

 
మొత్తం మీద విషయం ప్రభుత్వ పెద్దల వరకూ వెళ్లింది. సమస్య పరిష్కారం దిశగా కొంత మథనం జరిగింది. వాహనాల లబ్ది దారులకు కొంత సబ్సిడీ భారం తగ్గిస్తే బావుంటుందన్న అభిప్రాయం ఈ చర్చల్లో వ్యక్తమైంది. అందుకు ప్రభుత్వం కూడా అంగీకరించడంతో ఇప్పుడు సబ్సిడీ భారం తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. మొత్తం మీద రేషన్ వాహనదారులకు నెలకు రూ. 3000 భారం తగ్గిందన్నమాట.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: