డజను మమూలు మామిడి పండ్లు రూ.1.2 లక్షలకు కొన్నాడు.. ఎందుకంటే..?

Chakravarthi Kalyan
మామిడి పండు ధర ఎంత.. కేజీ మహ అయితే వంద రూపాయలు.. లేదంటే ప్రత్యేకంగా తెప్పించుకుంటే.. కేజీ మహా అయితే 200, 300 అంతే కదా.. అంటే పండు మహా అయితే రూ.50 లేదా 100.. కానీ.. ఓ వ్యక్తి మాత్రం కావాలనే ఒక్కో పండును రూ. 10 వేలు ఇచ్చి కొన్నాడు. అలా ఒకటి, రెండు కాదు.. ఏకంగా పది పండ్లు కొన్నాడు. అంటే మొత్తం 10 పండ్లు.. లక్షా 20 వేలు ఇచ్చి కొన్నాడు.. పోనీ.. అవేమైనా ప్రత్యేకమైన పండ్లా అంటే అదీ కాదు.. మామూలు పండ్లే.. మరి ఎందుకు అలా కొన్నాడు.


ఇలా కొనడం వెనుక ఓ కథ ఉంది. ఆ మామిడి పండ్లు అమ్ముతోంది ఓ బాలిక. ఆమె ఓ విద్యార్థిని లాక్‌డౌన్ సమయంలో ఆన్ లైన్ క్లాసులు వినేందుకు స్మార్ట్ ఫోన్‌ లేదు. అందుకే ఫోన్ కొనుక్కునేందుకు ఇలా రోడ్డు పక్కన మామిడి పండ్లు అమ్ముతోంది. ఆ విషయం ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దాన్ని వ్యాపారవేత్త హమేయా హెటె చూశాడు. ఆ బాలికకు సాయం చేయాలనుకున్నాడు. అంతే వెంటనే రోడ్డు పక్కన మామిడిపండ్లు అమ్ముతున్న బాలిక దగ్గరకు కారులో వచ్చాడు.


అందులోంచి దిగిన హమేయా ఒక్కో మామిడిపండు రూ.10 వేలకు కొంటున్నట్లు చెప్పాడు. ఆ బాలిక ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపే మొత్తం పన్నెండు పండ్లకు రూ.1.2 లక్షలకు కొనేశాడు. ఆ మొత్తాన్ని ఆ బాలిక తండ్రి శ్రీమర్‌ కుమార్‌ బ్యాంకు అకౌంట్‌కు బదిలీ చేశాడు. ఇదంతా జరిగింది ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని జంషెడ్‌పుర్‌లో. ఆ బాలిక పేరు తులసి కుమారి. ఈ బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అయిదో తరగతి చదువుతోంది.


హమేయా హెటె చేసిన ఈ సాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ డబ్బుతో తులసి ఓ స్మార్ట్ ఫోన్ కొనుక్కుని ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతోంది. తాను అమ్మే మామిడి పండ్లతో ఆ స్మార్ట్ ఫోన్‌తో ఓ ఫోటో దిగి సోషల్ మీడియాలో ఉంచింది. ఇప్పుడు ఇది బాగా వైరల్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: