ఆ లీడర్.. కేసీఆర్ కోసం దారి కాచాడు.. అనుకున్నది సాధించాడు..।?
ఇంతకీ ఆయన ఎవరు.. సీఎం కేసీఆర్‌ను కలిసి ఏం చెప్పాలనుకున్నారు.. వివరాల్లోకి వెళ్తే.. ఆయన పేరు సత్తార్. మెదక్ జిల్లా తూప్రాన్ కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు. తూప్రాన్ మండల మైనార్టీ సెల్ ప్రెసిడెంట్. ఆయన సమస్య వాస్తవానికి ఆయన ఒక్కడి సమస్య కాదు. కేసీఆర్ సర్కారు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పేరిట అమ్మాయిల పెళ్లికి లక్ష రూపాయల వరకూ సాయం చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే.. ఈ షాదీ ముబారక్‌కు దరఖాస్తు చేయడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయట. అధికారులు అడుగుతున్న వివరాలు.. ధ్రువపత్రాలు సమర్పించడం ముస్లిం కుటుంబాలకు పెద్ద తలనొప్పిగా మారిందట. ఈ నిబంధనల కారణంగా చాలా మంది అర్హత ఉన్నా షాదీ ముబారక్ సొమ్ము పొందలేకపోతున్నారట. ఈ విషయం నేరుగా సీఎంను కలిసి ఫిర్యాదు చేయాలనుకున్నారు. అందుకే తాను చెప్పాలనుకున్నదంతా ఓ లెటర్లో రాసి.. సీఎం తమ ప్రాంతం మీదుగా వస్తున్నారని తెలిసి దారి కాచారు.
సీఎం కేసీఆర్ నిజామాబాద్ పర్యటన ముగించుకొని ఎర్రవెల్లి ఫాం హౌస్ వెళ్తున్న సమయంలో.. తూప్రాన్ సెయింట్ ఆర్నాల్డ్ స్కూల్ వద్ద వినతి పత్రంతో నిలబడి ఉన్నా సత్తార్ ను సీఎం గమనించారు. తన కాన్వాయ్ ఆపారు. భద్రతా సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్నారు. సత్తార్ చేతిలో ఉన్న వినతిపత్రాన్ని తీసుకున్నారు. సమస్య పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. అలా మొత్తానికి మండల స్థాయి నేత సత్తార్ అనుకున్నది సాధించారు. మరి ఆయన ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు ఏం తీసుకుంటారో చూడాలి.