జగన్‌కు మోదీ సాయం లేనట్లేనా!

M N Amaleswara rao

రాష్ట్ర విభజన తర్వాత ఏపీని కేంద్రం పెద్దగా ఆదుకోలేదనే చెప్పొచ్చు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా, పూర్తి స్థాయిలో మోదీ ప్రభుత్వం సాయం దొరకలేదు. ఆఖరికి రాష్ట్రానికి ఊపిరి లాంటి ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. ఇక చంద్రబాబు సైతం హోదాని సైడ్ చేసేశారు. కాకపోతే కేంద్రం నుంచి ఎలాంటి నిధులు వచ్చిన వాటికి చంద్రబాబు పేరు వేసుకుని ఖర్చు పెట్టేశారు. ఈ విషయంలో చాలాసార్లు బీజేపీ నేతలు చంద్రబాబుపై విమర్శలు చేశారు.


ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్‌ది అదే తంతు అని బీజేపీ నేతలు విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. అయితే రాష్ట్రం ఇస్తున్న పన్నులనే కేంద్రం తిరిగి నిధుల రూపంలో ఇస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అంతేగానీ ప్రత్యేకంగా కేంద్రం సాయం చేయడం లేదని అంటున్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం ఏపీలో మొదలైన ఇళ్ల స్కీమ్‌లో కూడా ఇదే తరహా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇచ్చింది. గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు భూమిని ఇచ్చింది. అయితే ఈ స్థలాల్లో ఎంత ఇల్లు వస్తుందనే విషయం పక్కనబెడితే, ఆ స్థలాల్లో జగనన్న కాలనీలు పేరిట ఇళ్ళు నిర్మించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఒకో ఇల్లు నిర్మాణం కోసం ప్రజలకు లక్షా 80 వేలు ఇస్తున్నారు. అయితే ఈ డబ్బులు ఒక ఇల్లు కట్టుకోవడానికి ఏ మాత్రం సరిపోదనే చెప్పొచ్చు. కాకపోతే ఈ డబ్బు అంతా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుంది కాదు. కేంద్ర పథకం పీఎంఏవై స్కీమ్‌లో భాగంగా లక్షా 50 వేలు వస్తున్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 30 వేలు ఇస్తుందని తెలుస్తోంది.


అయితే ఇదేగాక జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 34,109 కోట్లు అవుతుందని, ఈ విషయంలో కేంద్రం అండగా ఉండాలని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణానికి కేంద్ర సాయం అందుతుంది. మరి మౌలిక వసతులకు కూడా మోదీ సాయం చేస్తారా? అనేది కాస్త డౌటే అని చెప్పాలి. చూడాలి మరి జగన్‌కు మోదీ సాయం చేస్తారో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: