చినబాబుకు వాళ్ళ సపోర్ట్ కావాల్సిందేనా?

M N Amaleswara rao

ఏ రాజకీయ పార్టీ అయిన అధికారంలో ఉంటే, ఆ పార్టీలో నాయకుల సందడి ఎక్కువ ఉంటుంది. ఇక అధికారం పోతే ఆ పార్టీ పరిస్తితి ఎలా ఉంటుందో ఏపీలో ఉన్న టీడీపీని చూస్తే అర్ధమవుతుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నాయకులు తెగ హడావిడి చేసేవారు. అలాగే బాబు చుట్టూ చేరి భజన చేసేవాళ్ళు. బాబు ఏదైనా పదవి ఇవ్వకపోరా అని చూసేవారు. ఇక పదవులు ఉన్నవారు బాబుకు డప్పు కొట్టే పనిలో బిజీగా ఉండేవారు.


కానీ బాబు అధికారం కోల్పోయాక నాయకుల సందడి తగ్గిపోయింది. అప్పుడు అధికారం అనుభవించినవారిలో కొందరు నాయకులు వైసీపీలోకి జంప్ కొట్టేశారు. మరికొందరు సైలెంట్‌గా ఉండిపోయారు. ఇక కొందరు మాత్రం బాబుకు సపోర్ట్‌గా వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు.


ముఖ్యంగా గతంలో బాబు కేబినెట్‌లో మంత్రులుగా చేసినవారు, ఇప్పుడు అడ్రెస్ లేకుండా పోయారు. గతంలో మంత్రులుగా పనిచేసినవారిలో 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన వారు...గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్పలు మాత్రమే. మిగతా మంత్రులంతా ఓటమి పాలయ్యారు. ఓడిపోయిన వారిలో కొందరు మాజీ మంత్రులు జగన్ పార్టీలోకి జంప్ కొట్టేశారు. అటు ఆదినారాయణరెడ్డి బీజేపీలోకి వెళ్లారు. ఇక పార్టీలో ఉన్న మిగతా మాజీ మంత్రులు బాబుకు సపోర్ట్‌గా ఉండటం లేదు. ఏదో కొందరు మాత్రమే పార్టీ తరుపున కష్టపడుతున్నారు.


అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర, భూమా అఖిలప్రియ, చినరాజప్ప, సోమిరెడ్డి లాంటివారే పార్టీలో ఎక్కువ కనిపిస్తున్నారు. మిగిలిన మాజీ మంత్రులు పార్టీలో సైలెంట్‌గా ఉండిపోతున్నారు. బయటకొస్తే ఎక్కడ వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతుందే అని భయంతో పార్టీ ‌లో యాక్టివ్‌గా తిరుగుతున్నట్లు లేరు. అయితే గతంలో కంటే ఇప్పుడు నారా లోకేష్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. భవిష్యత్‌లో టీడీపీని నడిపించాలి కాబట్టి, లోకేష్ దూకుడుగా ఉంటున్నారు. కానీ మిగిలిన నాయకులు కూడా యాక్టివ్ అయితే పార్టీకి బెన్‌ఫిట్ ఉంటుందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: