బాబు...అవంతిని ఢీకొట్టే నాయకుడు ఎవరు?
విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం...తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఈ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎక్కువసార్లు ఎగిరింది. భీమిలిలో టీడీపీ ఆరు సార్లు గెలిచింది. 2014లో ఇక్కడ నుంచి గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల్లో మాత్రం గంటా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పోటీ చేయగా, చివరి నిమిషంలో సబ్బం హరికి భీమిలి టిక్కెట్ ఇచ్చారు.
అయితే జగన్ వేవ్‌లో సబ్బం ఓడిపోయారు. వైసీపీ నుంచి పోటీ చేసిన అవంతి శ్రీనివాస్ చేతిలో దాదాపు 9,700 ఓట్ల తేడాతో ఓడిపోయారు. పైగా వైసీపీ అధికారంలోకి రావడంతో అవంతి మంత్రి అయ్యి మరింత దూకుడుగా నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు బాగా ప్లస్ అవుతున్నాయి. అలా అని ఇక్కడ టీడీపీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కానీ ఓడిపోయాక సబ్బం భీమిలి వైపు వెళ్లలేదు. అయితే ఇటీవల సబ్బం కరోనాతో మరణించారు.
సబ్బం మరణించడంతో భీమిలిలో టీడీపీని నడిపించే నాయకుడు ఎవరని, అక్కడ టీడీపీ కార్యకర్తల నుంచి ప్రశ్న వస్తుంది. బలంగా ఉన్న మంత్రి అవంతి శ్రీనివాస్‌ని ఢీకొట్టే నాయకుడు కావాలని తమ్ముళ్ళు గట్టిగా చూస్తున్నారు. అయితే నియోజకవర్గంలో యాక్టివ్‌గా ఉంటున్న మాజీ ఎంపీపీ కోరాడ రాజబాబుకు ఇన్‌చార్జ్ పదవి ఇవ్వాలని డిమాండ్ వస్తుంది. కాపు సామాజికవర్గానికి చెందిన రాజబాబుకు నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా భీమిలిలో కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువ. గత కొన్నేళ్లుగా నియోజకవర్గంలో కాపు నాయకులే గెలుస్తూ వస్తున్నారు.
ఇదే సమయంలో ఇన్‌చార్జ్ రేసులో భీమిలీ పట్టణ టీడీపీ ప్రెసిడెంట్ గంటా నూకరాజు పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఇన్‌చార్జ్ పదవి బలమైన నాయకుడుకు ఇస్తేనే అవంతిని ఢీకొట్టడం సులువు అవుతుందని తమ్ముళ్ళు భావిస్తున్నారు. త్వరగా ఇన్‌చార్జ్‌ని ప్రకటిస్తే, ఇప్పటినుంచి పనిచేస్తే, నెక్స్ట్ ఎన్నికల్లో పార్టీ గెలుపు సులువు అవుతుందని అంటున్నారు. అలా కాకుండా గత ఎన్నికల్లో మాదిరిగా చివరిలో ఎవరొకరిని అభ్యర్ధిగా పెడితే గెలుపు కష్టమంటున్నారు.