దేశ రాజధాని ఢిల్లీని మహమ్మారి కరోనా సెకండ్ వేవ్ దాదాపు రెండు నెలల పాటు ఒక కుదుపు కుదిపేసిన విషయం తెలిసిందే. ప్రజలకు, కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈ మాయదారి వైరస్ అక్కడ ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. ఆ రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. మెల్లగా కేసులు తగ్గుముఖం పట్టాయి, రికవరీ రేటు కాస్త పెరిగింది. అయితే కరోనాకు సంబంధించిన మరో వార్త ఈ ఆనందం ఎక్కువ సేపు ఉండనిచ్చేలా లేదు. తాజాగా ఐఐటీ ఢిల్లీ కరోనా థర్డ్ వేవ్ పై ఒక నివేదిక ను విడుదల చేసింది. అందులో కరోనాకు సంబంధించిన వివరాలు చూస్తే గుండెల్లో వణుకు పుట్టించేలా ఉన్నాయి.
ఐఐటి ఢిల్లీ అందించిన నివేదికలో, రాష్ట్రంలో రానున్న రోజుల్లో కరోనా ఎలా ఉండబోతుంది అన్న గణాంకాలను అంచనా వేశారు. అయితే అవి మరింత భయాందోళనలను పెంచుతున్నాయి. ఆ నివేదిక ప్రకారం కరోనా మూడవ దశలో రోజుకు సుమారు 45 వేల కొత్త కేసులు పుట్టుకొస్తాయని అంచనా వేశారు. అదే విధంగా ప్రతి దినం తొమ్మిది వేల మందికి పైగా పేషెంట్లు అత్యవసర పరిస్థితి నిమిత్తం హాస్పిటల్ లో చేరుతారని అంచనా. ఈ లెక్కల ప్రకారం ప్రతిరోజు 944 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కరోనా రోగులకు సరఫరా చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా డాక్టర్లు, నర్సులు గతానికి మించి ఎక్కువ శ్రమించాల్సి ఉంటుందంటున్నారు.
మరో వైపు ఢిల్లీ ప్రభుత్వం కూడా రాబోతున్న ఈ కరోనా విలయాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తగిన వ్యూహాత్మక రచనలు చేసుకోవాలని నివేదిక సూచిస్తోంది. ఈ మేరకు అలెర్ట్ అయిన ఢిల్లీ ప్రభుత్వం శరవేగంగా ప్రణాళికలు రచిస్తోంది. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు కావాల్సిన సదుపాయాలపై దృష్టి పెట్టి చకచకా సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే లాక్ డౌన్ ఆంక్షలపై మరింత కఠిన చర్యలు తీసుకునేలా సర్కారు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.