ఇలాంటి పాత్ర మీ ఇంట్లో ఉంటే అదృష్టవంతులే..!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మదనపల్లె–పుంగనూరు మార్గంలోని బసినికొండ వై జంక్షన్ వద్ద మూడు వాహనాల్లో వచ్చిన కొంతమంది రాగిపాత్రను పరిశీలిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లగా పారిపోయేందుకు యత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి స్కెచ్ అంతా వివరించారు. చిత్తూరు, కడప, అనంతపురం, తెలంగాణలోని వరంగల్, హైదరాబాద్ కు చెందిన 13 మంది వ్యక్తులు రైస్ పుల్లింగ్ పేరుతో రాగిపాత్రలను విక్రయించి దందా చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు చిక్కారు.
అయితే వీరంతా రాగిపాత్రలకు రంగుపూసి దానిపై టార్చ్ లైట్ వేసి చూపించి అది మహిమగల పాత్ర అని.. పూజలుచేస్తే అక్షయపాత్రలా మారిపోతుందని బాగా డబ్బున్నవాళ్లను నమ్మిస్తూ మోసం చేస్తున్నారు. పాత్రను రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బేరం పెడుతున్నారు. ముఠా వ్యవహారంపై నిఘా ఉంచిన పోలీసులు వారిని పక్కా స్కెచ్ తో అరెస్ట్ చేశారు.
ఇక నిందితుల వద్ద నుంచి మూడు కార్లు, రూ.20,700 నగదు స్వాధీనం చేసుకున్నారు. రైస్ పుల్లింగ్ వంటి మాటలు అన్ని మోసాలేనని.. ఇలాంటివి అసలు పనిచేయవని.. ప్రజలు ఇలాంటివారిని నమ్మి మోసపోవద్దని సూచించారు. గతంలో విజయనగరం జిల్లాలోనూ ఓ ఇత్తడి చెంబును మహిమాన్విత చెంబుగా నమ్మించి రూ.50 కోట్లకు బేరం పెట్టిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.