ఏపీపై ట్రావెల్ బ్యాన్.. ఈ పాపం ఎవరిది..?

Deekshitha Reddy
ఏపీపై వివిధ రాష్ట్రాలు ట్రావెల్ బ్యాన్ విధించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ నుంచి వచ్చే వారిపై ఢిల్లీ ప్రభుత్వం కఠిన ఆంక్షలు పెట్టింది. రోడ్డు, రైలు, వాయు మార్గాలలో ఏ రూపంలో వచ్చినా కచ్చితంగా 14 రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలని, దానికయ్యే ఖర్చు సదరు వ్యక్తులే భరించాలని తేల్చి చెప్పింది. వ్యాక్సిన్ వేయించుకున్న ధృవీకరణ పత్రాలు చూపించినా, 72గంటల ముందు చేసిన ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాల్లో నెగెటివ్ ఉన్నా కూడా హోమ్ ఐసోలేషన్ తప్పదంటోంది. అటు ఒడిశా, తమిళనాడు కూడా సరిహద్దుల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నాయి. అయితే ఈ పాపం అంతా ప్రతిపక్షనేత చంద్రబాబుదేనంటున్నారు అధికార పక్ష నేతలు. చంద్రబాబు స్వార్థరపర రాజకీయాల వల్లే.. ఏపీపై ఇతర రాష్ట్రాలు ట్రావెల్ బ్యాన్ విధించాయని చెబుతున్నారు.
ఎన్440-కె వేరియంట్ ఏపీలో ఉందని, దానివల్లే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని ఇటీవల చంద్రబాబు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మంత్రి పేర్ని నాని సహా.. ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్‌ జవహర్ రెడ్డి కూడా ఏపీలో ఎన్‌440-కె వైరస్ లేదని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ఈ తరహా వైరస్‌ ఉన్నట్టు ఎలాంటి నిర్థారణ జరగలేదని.. అందుకు సంబంధించిన పరిశోధన డేటా కూడా ఏమీలేదని జవహర్ రెడ్డి వెల్లడించారు. అదే సమయంలో చంద్రబాబు లాంటి వారు ఏపీపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండి పడుతున్నారు. తాజాగా సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఏపీపై ట్రావెల్ బ్యాన్ చంద్రబాబు చేసిన తప్పేనంటూ విమర్శించారు. పక్క రాష్ట్రంలో కూర్చున్న బాబు, ఏపీపై విషప్రచారం చేస్తున్నారని, ఏపీ ప్రజలను భయాందోళనలకు గురి చేయడమే ఆయన పని అని అన్నారు.
మరోవైపు టీడీపీ కూడా ప్రభుత్వ దాడిని తిప్పి కొడుతోంది. ఏపీలో కొత్త రకం కొవిడ్‌ వేరియంట్ వ్యాప్తి తీవ్రత లేకపోతే పొరుగు రాష్ట్రాలు ఎందుకు ఆంక్షలు విధిస్తున్నాయని ప్రశ్నించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ప్రజల ప్రాణాల కంటే జగన్‌ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రతపై హైకోర్టు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పగలదా? అని అచ్చెన్న ప్రశ్నించారు. ఇకనైనా తప్పిదాలు కప్పిపెట్టకుండా ప్రతిపక్షాలు, శాస్త్రవేత్తలు, న్యాయస్థానాలు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలని హితవుపలికారు.
అరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా.. ఏపీలో కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతోందనే మాట మాత్రం వాస్తవం. వేరియంట్ పై ఇప్పటికే అధికారులు క్లారిటీ ఇచ్చారు కాబట్టి దానిపై.. నిపుణుల సమాచారం మాత్రమే నమ్మదగినది. వేరియంట్ లపై జరుగుతున్న గొడవతో అసలు వ్యవహారం పక్కదారి పడుతోంది. ఏపీలో వైద్య సేవలపై ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేస్తున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మరీ అంత సంతృప్తికర స్థాయిలో లేవనేది వాస్తవం. ఇప్పటికే జాతీయ స్థాయిలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇకనైనా ఏపీని ఇతర రాష్ట్రాలు వేరు చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు, ప్రతిపక్షాలపై కూడా ఉందనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: