బాబోరికి అత్త పోరు పోయినట్టేనా..?

Deekshitha Reddy
2005 సంవత్సరం నుంచి చంద్రబాబుపై లక్ష్మీపార్వతి న్యాయ స్థానాల్లో పోరాటం చేస్తూనే ఉన్నారు. ఏసీబీ న్యాయస్థానంలో కేసు వేసి బాబుకి 16ఏళ్లుగా ముచ్చెమటలు పోయిస్తున్నారు. అయితే ఈ పోరాటం ఇప్పుడు ముగిసినట్టేనని తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారంటూ చంద్రబాబుపై లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్ ను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. తగిన ఆధారాలు లేని కారణంగా ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని తేల్చి చెప్పింది ఏసీబీ కోర్టు.

అసలేంటి కథ..?
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టులో లక్ష్మీపార్వతి పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ విచారణకు ఆదేశించాలంటూ 2005లో ఆమె ఈ పిటిషన్ వేశారు. అయితే ఈ కేసు విచారణ ప్రారంభం కాకముందే ఇంప్లీడ్ పిటిషన్ చంద్రబాబు దాఖలు చేశారు. ఫిర్యాదు స్వీకరించడానికి ముందే వాదనలు ఎలా వింటామని ప్రశ్నించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు అప్పట్లో చంద్రబాబు అభ్యర్థనను తోసి పుచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. ఏసీబీ కోర్టులో విచారణకు సంబంధించి తదుపరి చర్యలు నిలిపివేస్తూ 2005లో స్టే విధించింది.

అయితే ఆ స్టే ఎత్తివేయాలంటూ లక్ష్మీపార్వతి అనుబంధ పిటిషన్ దాఖలు చేయగా.. దాన్ని హైకోర్టు కొట్టివేసింది. 2005నుంచి స్టే కొనసాగుతున్న సందర్భంలో.. చంద్రబాబు స్టేలతోనే విచారణను ఎదుర్కొంటున్నారని ఆయనపై వైరిపక్షాలు ఆరోపణలు చేస్తుంటాయి. దమ్ముంటే చంద్రబాబు ఏసీబీ విచారణకు సిద్ధం కావాలని డిమాండ్ చేస్తుంటాయి. ఈ క్రమంలో లక్ష్మీపార్వతి కూడా తన పోరాటాన్ని ఆపలేదు. సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే, ఆరు నెలలకు మించి ఉండకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మరోసారి చంద్రబాబు కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది.

అయితే సరైన ఆధారాలు లేవనే కారణంతో లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్ ను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. 2005నుంచి ఈ పిటిషన్ తో లక్ష్మీపార్వతి, చంద్రబాబుని కలవరపెడుతూనే ఉన్నారు. తాజాగా ఏసీబీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులతో చంద్రబాబుకి ఊరట లభించినట్టయింది. బాబుపై, లక్ష్మీపార్వతి పోరాటం ముగిసినట్టేనని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: