ఆ విషయంలో వెనక్కి తగ్గని జగన్..బాబుకు అర్ధం కావడం లేదా?
ఏపీలో కరోనా అలజడి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఊహించని విధంగా ఏపీలో సెకండ్ వేవ్ కరోనా తీవ్రంగా ఉంది. రోజుకు 10 వేల పైనే కరోనా కేసులు బయటపడుతున్నాయి. అలాగే వందకు పైనే కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. అలాగే కరోనా కేసులు పెరుగుతుండటంతో హాస్పిటల్స్లో బెడ్ల కొరత ఎక్కువైంది. అలాగే ఆక్సిజన్ కొరత కూడా ఎక్కువగా ఉంది. కరోనా వల్ల కొందరు మరణిస్తుంటే, మరికొందరు కరోనా వచ్చాక సరైన వైద్యసదుపాయలు అందక చనిపోతున్నారు.
అయితే రాష్ట్రంలో ఇలా కరోనా కల్లోలం కొనసాగుతున్నా సరే, సీఎం జగన్ ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాను అనుకున్న విధంగా, అనుకున్న సమయానికి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఇటీవలే జగనన్న విద్యా దీవెన అందించిన ప్రభుత్వం తాజాగా జగనన్న వసతి దీవెన ఇచ్చింది.
పిల్లల చదువుల కోసం ఏ తల్లిదండ్రులూ అప్పుల పాలు కావొద్దనే ఉద్దేశంతో జగన్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి ఏటా 2 వాయిదాల్లో ఐటీ విద్యార్థులకు 10 వేలు అందజేస్తున్న ప్రభుత్వం, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15 వేలు అందజేస్తుంది. అయితే ఇలా ప్రజలకు మేలు చేసే పథకాల విషయంలో కూడా టీడీపీ విమర్శలు చేస్తుంది. ఈ కరోనా సమయంలో ప్రజలకు కావాల్సింది సరైన వైద్యసదుపాయాలని, పథకాలు కాదని మాట్లాడుతున్నారు.
అయితే ఇక్కడ జగన్ కరోనా కట్టడి విషయంలో గట్టిగానే నిలబడుతున్నారు. సరైన వైద్యం అందక ఏ ఒక్కరూ చనిపోకూడదనే ఉద్దేశంతో ముందుకెళుతున్నారు. అదే సమయంలో పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడే పథకాలని కూడా ఆపడం లేదు. కానీ ఈ విషయం ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు సరిగ్గా అర్ధం కావడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. అసలు జగన్ ఏం చేసినా చంద్రబాబు విమర్శించడమే పనిగా పెట్టుకుని ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రజలకు మేలు చేసే విషయంలో జగన్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదని అంటున్నారు.