దారుణం: హాస్పిటల్లో బెడ్ నుండి స్మశానంలో అంత్యక్రియలు పొందడం వరకు అంతా యుద్ధమే...?

VAMSI
భూభాగ విస్తీర్ణపరంగా ప్రపంచంలో 7 వ అతిపెద్ద దేశం భారతదేశం. అంతేకాక రెండవ అత్యధిక జనాభా కలిగిన బహుభాషా వినియోగంలో ఉన్న దేశం. స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల గొప్ప దేశం. సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భారతీయుడు అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు అంతటి విశిష్టత మన దేశానికి ఉంది. బంధాలకు బాంధవ్యాలకు భారత దేశం పుట్టినిల్లు. అలాంటి గొప్ప విశిష్టత ఉన్న ఈ దేశ చరిత్రను కాలరాస్తోంది కరోనా. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి మన దేశాన్ని సైతం కబళించేస్తోంది. ఒకప్పుడు బ్రిటిష్ వారితో చేసిన యుద్ధం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఈ మాయదారి కరోనాతో భారతీయులు పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ మొదలై కలకలం రేపుతున్న వేళ ఎక్కడ చూసినా కరోనా బాధితులే కనిపిస్తున్నారు.. ఏ నోట విన్నా కరోనా కష్టాలే.
కరోనా మొదటి వేవ్ అప్పుడు త్వరగానే లాక్ డౌన్ అమలు చేసిన సందర్భాలు చూశాం. వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, పెద్ద ఎత్తున రోడ్లను శుభ్రపరచడం వంటి నివారణ చర్యలు వేగవంతం చేశారు. కరోనా టెస్టులు సైతం భారీ సంఖ్యలో చేసి.. కరోనా రోగులను వెంటనే గుర్తించి తగిన జాగ్రత్తలతో వైరస్ వ్యాప్తి ప్రభావం తగ్గించారు. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇవేవీ పెద్దగా కనిపించడం లేదు. ఓ వైపు కరోనా కేసుల సంఖ్య లక్షలు దాటుతున్నా నివారణ చర్యలు వేగవంతం చేయలేదన్నది కనిపిస్తున్న సత్యమే. అవసరం ఉన్నంత స్థాయిలో కరోనా పరీక్షలు జరపడం లేదు. కరోనా పరీక్ష చేయించుకోవాలి అంటే సామాన్యుడికి ఒక యుద్ధం లాగే అనిపిస్తోంది. ఎక్కడ చేస్తారు ఏమిటో అన్న వివరాలు అందరికీ సరిగా అందడం లేదు. ఒకవేళ ఎలాగోలా ప్రభుత్వాసుపత్రిలో చేయించుకున్నాక పాజిటివ్ వస్తే త్వరగా తగ్గిపోతే పర్వాలేదు.
ఒకవేళ వైరస్ ప్రభావం ఎక్కువ అయితే ఆస్పత్రులలో బెడ్స్ కోసం ఒక యుద్ధం, ఆక్సిజన్ సిలిండర్లు వెంటిలేటర్లు కోసం మరో యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కానీ వాటిని పొందడం కోసం కూడా ఒక యుద్ధం చేయాల్సి వస్తోంది. అందరికీ వ్యాక్సినేషన్ అందుబాటులోకి రాలేదు, అనుకున్న వెంటనే అందరికీ దొరకడం లేదు. ఇకపోతే మన దేశంలో శుభకార్యాలు. వేడుకలు బంధుమిత్రులతో ఎక్కువగా జరుగుతుంటాయి. అలాంటిది అవన్నీ ఇప్పుడు కనిపించడం లేదు. ఇదలా ఉంచితే... మరణించిన వ్యక్తికి కుటుంబ సభ్యులు దగ్గరుండి అంత్యక్రియలు జరిపిస్తారు. బంధుమిత్రులు తమ ఆత్మీయులు మరణిస్తే.. కడసారి చూపు కోసం పరుగులు తీస్తారు. అలాంటిది ఈ కరోనా మహమ్మారి కారణంగా మన పద్ధతులు సైతం దూరం అయ్యాయి, మానవత్వం అడుగంటి పోతోంది.
కరోనాతో వ్యక్తి మరణిస్తే వారిని తాకడం కాదు కదా ..కనీసం చూడడానికి సైతం ఎవరూ రావడం లేదు. చివరికి కుటుంబ సభ్యులు కూడా వైరస్ భయంతో దూరంగా ఉండిపోతున్నారు. కరోనా సోకిన వ్యక్తి మరణిస్తే వారి అంత్యక్రియల బాధ్యత అంబులెన్స్ సిబ్బందికి అప్పగిస్తున్నారు. ఇలా చివరికి మరణించాక కూడా అంత్యక్రియల కోసం ఒక యుద్ధమే చేయాల్సి వస్తోంది. ఈ మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో... తిరిగి మన భారతదేశం మునుపటి సంప్రదాయాల రంగులు పులుముకుంటుందో...?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: