అయ్యో...! ఖ‌మ్మం కార్పొరేష‌న్‌లో కాంగ్రెస్‌కు షాక్‌..!!

Thanniru harish
మూలిగే న‌క్క‌పై తాడిపండు ప‌డ్డ‌చందంగా త‌యారైంది ఖ‌మ్మం కార్పొరేష‌న్‌లో కాంగ్రెస్ ప‌రిస్థితి. జెట్‌స్పీడ్‌తో దూసుకెళ్తున్న తెరాస‌ను ఢీకొట్టే ద‌మ్ము ఆ పార్టీలో క‌రువైంది. మంత్రి పువ్వాడ అజ‌య్ వేగానికి కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్‌నేత‌లుసైతం తేలిపోతున్నారు. దీంతో గుడ్డిలోమెల్ల అన్న‌చందంగా క‌నీసం ఓ ప‌ది స్థానాల్లోనైనా పార్టీ అభ్య‌ర్థులు గెలిస్తే ఖ‌మ్మంలో కాంగ్రెస్ ప్ర‌భావం ఉంద‌ని అనిపించుకొనేందుకు ఆ పార్టీ ముఖ్య‌నేత‌లు తాప‌త్ర‌య ప‌డుతున్నారట‌. ఈ త‌రుణంలో వారికి సొంత పార్టీ అభ్య‌ర్థులే షాక్‌ల‌మీద షాక్‌లిస్తున్నారు.  ఖ‌మ్మం కార్పొరేష‌న్‌లో 60 డివిజ‌న్‌ల‌లో ఇప్ప‌టికే ఒక డివిజ‌న్ ఏక‌గ్రీవం అయింది.

59 డివిజ‌న్‌ల‌కు ఈనెల‌30న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. నేటితో ప్ర‌చారానికి తెర‌ప‌డ‌నుండ‌టంతో మంగ‌ళ‌వారం ఆ పార్టీ ముఖ్య‌నేత‌లు అభ్య‌ర్థుల గెలుపుకు మ‌ద్ద‌తుగా విస్తృత ప్ర‌చారం చేస్తున్నారు. కార్పొరేష‌న్‌లో అభ్య‌ర్థుల గెలుపు బాధ్య‌త‌ల‌ను టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ భ‌ట్టి విక్ర‌మార్క తీసుకున్నాడు. అభ్య‌ర్థుల‌తో క‌లిసి విస్తృత ప్ర‌చారంసైతం నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో తెరాస నేత‌ల వ్యూహాల‌కు ఎదుర్కోవ‌టంలో భ‌ట్టి విఫ‌ల‌మ‌వుతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. 18వ డివిజ‌న్ కాంగ్రెస్ అభ్య‌ర్థి అయినాల ప‌ద్మ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో తెరాస‌కు జై కొట్టారు. నేరుగా వెళ్లి పువ్వాడ అజ‌య్ స‌మ‌క్షంలో తెరాస తీర్థం తీసుకున్నారు. ఊహించ‌ని ప‌రిణామంతో కంగుతిన‌డం కాంగ్రెస్ నేత‌ల వంతైంది. అస‌లే క‌నీసం ప‌ది స్థానాల‌నైనా ద‌క్కించుకోగ‌ల‌మా అన్న ఆందోళ‌న‌లో కాంగ్రెస్ నేత‌లు ఉంటే.. ఒక్కొక్క‌రుగా కాంగ్రెస్ ను వీడి తెరాస‌కు జై కొడుతుండ‌టంతో పార్టీ శ్రేణుల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తుంది.

కొవిడ్ నిబంధ‌న‌ల కార‌ణంగా నేటితో ప్ర‌చారం ముగియ‌నుంది. పోలింగ్‌కు రెండు రోజుల స‌మ‌యం ఉంది. ఈ క్ర‌మంలో క‌నీసం ప‌దిమంది కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను తెరాస‌కు జైకొట్టించే ప‌నిలో పువ్వాడ అనుచ‌రులు నిమ‌గ్న‌మ‌య్యార‌ట. కొన్ని డివిజ‌న్‌ల‌ను ఎంపిక చేసుకొని అక్క‌డ పోటీచేసే కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌తో మంత‌నాలు చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. దీంతో కాంగ్రెస్ నేత భ‌ట్టి విక్ర‌మార్క, ఇత‌ర సీనియ‌ర్ నేత‌లు తెరాస వ్యూహాన్ని అడ్డుకొనేందుకు తంటాలు ప‌డుతున్నార‌న్న చ‌ర్చ సాగుతుంది. మొత్తానికి పోలింగ్‌కు రెండు రోజుల ముందే ఖ‌మ్మం కార్పొరేష‌న్‌లో కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంటుండ‌టం కాంగ్రెస్ శ్రేణుల‌ను ఆందోళ‌న‌కు గుర్తిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: