మీరు ఓకే అంటే నేను రెడీ... సీఎంకు జగన్ లేఖ

Gullapally Rajesh
రెండు తెలుగురాష్ట్రాల మధ్య సమస్యలతో పాటుగా సరిహద్దు రాష్ట్రాల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఒడిశా తో సమస్యలు ఏపీ సర్కార్ ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇక ఈ సమస్యల పరిష్కారానికి ఏపీ సర్కార్ ఈ మధ్య కాలంలో కాస్త గట్టిగా దృష్టి సారించింది. అయినా సరే సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ఓడిశా విషయంలో కోటియా గ్రామాల సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్య పరిష్కారానికి ఏపీ సిఎం వైఎస్ జగన్ కూడా సిద్దంగానే ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాసారు.
రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఒప్పందాలు సరిగ్గా అమలయ్యే విధంగా చూడాలని విజ్ఞప్తి చేసారు. వంశధార వివాదాల ట్రిబ్యునల్ ఇచ్చిన తుది తీర్పు ప్రకారం నేరడి బ్యారేజ్ నిర్మించుకునేందుకు అనుమతి ఉంది అని ఆయన అన్నారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం రెండు రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుందని సూచన చేసారు జగన్. దీనివల్ల రెండు రాష్ట్రాల్లో తాగు, సాగునీరు అవసరాలు తీరుస్తుంది అని ఆయన వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా, ఒడిషాలోని గజపతి జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలు, ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది అని జగన్ లేఖలో వివరించారు.
ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఏపీలోని ప్రజలు ఎదురుచూస్తున్నారు అని ఆయన అన్నారు. ఇప్పటికే 80 టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తుంది అని వెల్లడించారు. ఇప్పటికే ఒడిషా ప్రభుత్వం వంశధార ట్రిబ్యునల్ లో సుప్రీంకోర్ట్ లో పిటిషన్ ను ఈ ప్రాజెక్ట్ పర్యవేక్షణపై దాఖలు చేశారు అని అన్నారు. ఇటువంటి సమస్యలను పరస్పరం మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చని సూచించిన ఏపీ సీఎం జగన్... మీ సమయం చెబితే నేరడి బ్యారేజ్ అంశంపై మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుందామని సీఎం జగన్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: