ఇవాళ ఉగాది.. ఈ ప్లవ నామ సంవత్సరం.. కీడు చేస్తుందా.. మేలు చేస్తుందా..?
కానీ.. ఈ ప్లవ నామ సంవత్సరం శుభప్రదమైన సంవత్సరం. ఎందుకంటే ప్లవ అంటే, దాటించునది అని అర్థం. "దుర్భిక్షాయ ప్లవ ఇతి. తతశ్శోభనే భూరితోయం....." దుర్భరమైన ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుంది అని వరాహసంహిత వివరించింది. అంటే చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తుందని అర్థం.
వికారి, శార్వరి తమ పేర్లకు తగ్గట్టుగా నడిపించాయి గదా. మరి ప్లవ తన పేరును సార్థకం చేసుకుంటుందని ఆశించటం తర్కసహితమైన ఆలోచనయేగదా. ప్లవ నామ సంవత్సరం ముగియగానే "శుభకృత్", ఆ తరువాతది " శోభకృత్" సంవత్సరములు. పేరుకు తగ్గట్టుగా ఇవి కూడా మన మనసుకు సంతోషాన్ని, వికాసాన్ని కలిగిస్తాయి. అభయాన్ని ప్రసాదిస్తాయి. అందుకే, ప్లవ నామ సంవత్సరానికి స్వాగతం చెబుదాం.
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ కూడా ఇదే అభిలాష వ్యక్తం చేశారు. శ్రీ ప్లవ నామ సంవత్సరం సందర్భంగా వారు శుభాకాంక్షలు తెలిపారు. నీరు సమృద్ధిగా ప్రవహించడం ఈ సంవత్సర ప్రాధాన్యతగా పంచాంగాలు చెప్తున్న నేపథ్యంలో.. వ్యవసాయానికి సాగునీరు మరింత సమృద్ధిగా లభించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యానికి ప్రకృతి కూడా తోడు కావడం శుభసూచకమన్నారు. వ్యవసాయ ప్రారంభ సంవత్సరంగా, రైతు పండుగగా ఉగాది ప్రసిద్ధిగాంచిందన్నారు.
ఆకులు రాల్చిన ప్రకృతి కొత్త చిగురులతో వసంతాన్ని మోసుకొస్తూ, నూతనోత్తేజాన్ని సంతరించుకుంటూ పక్షుల కిలకిలా రావాలతో ఆహ్లాదకరమైన కొత్త జీవితానికి ఉగాది ఆహ్వానం పలుకుతుందని సిఎం తెలిపారు. వ్యవసాయానికి ముందస్తు ఏర్పాట్లను ఉగాది నుంచే రైతు ప్రారంభిస్తారని, అన్నదాతను వ్యవసాయానికి సంసిద్ధం చేసే ఉగాది.. అతని జీవితంలో భాగమైపోయిందని అన్నారు.