బైరెడ్డి సిద్ధార్థ్‌కి ఆ ఛాన్స్ ఉందా?
బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి...ఏపీ రాజకీయాల్లో మంచి క్రేజ్ ఉన్న యువ నాయకుడు. వైసీపీలో కీలకంగా ఉన్న బైరెడ్డి అంటే వైసీపీ యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. అతి తక్కువ కాలంలోనే కీలక నాయకుడుగా ఎదిగిన బైరెడ్డికి, కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. అందుకే ఆ నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా పెట్టారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసిన ఆర్థర్ భారీ మెజారిటీతో గెలవడంలో కీలక పాత్ర పోషించారు.
అయితే ఆర్థర్ గెలిచాకే పరిస్థితులు మారిపోయాయి. నియోజకవర్గంలో ఆర్థర్, బైరెడ్డిలకు అసలు పొసగడం లేదు. నిత్యం వీరి మధ్య ఏదొక రచ్చ జరుగుతూనే ఉంది. గత రెండేళ్లుగా వీరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇన్‌చార్జ్‌గా బైరెడ్డి దూకుడు ప్రదర్శిస్తుంటే, ఆయన దూకుడుకు చెక్ పెట్టి ఆధిక్యం తెచ్చుకోవాలని ఆర్థర్ చూస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో ఆర్థర్, బైరెడ్డి వర్గాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వైసీపీ అధిష్టానం ఎప్పటికప్పుడు సర్ది చెబుతున్నా కూడా, రెండు వర్గాలు ఏ మాత్రం తగ్గడం లేదు.
అయితే ఈ రెండు వర్గాల మధ్య విభేదాలని తగ్గించాలంటే బైరెడ్డికి నెక్స్ట్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే బాగుంటుందనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇప్పటికే బైరెడ్డి అభిమానులు ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి వైసీపీలో బైరెడ్డికి కీలక పదవులు ఏమి దక్కలేదు. ఇప్పటికీ ఆయన నందికొట్కూరు ఇన్‌చార్జ్‌గానే ఉన్నారు. కానీ రాబోయే రోజుల్లో బైరెడ్డికి కీలక పదవి దక్కుతుందని అనుకుంటున్నారు.
ఒకవేళ ఎమ్మెల్యే సీటు దక్కాలంటే నందికొట్కూరులో పోటీ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇది ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం. కాబట్టి వేరే చోట ఇవ్వాలి. కానీ అన్నిచోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్‌గా ఉన్నారు. దీని బట్టి చూస్తే బైరెడ్డికి నెక్స్ట్ ఛాన్స్ వస్తుందా? లేదా? అనేది చెప్పలేం. అయితే బైరెడ్డికి ఉన్న క్రేజ్ బట్టి చూస్తే ఏదైనా మంచి అవకాశం ఇస్తేనే బెటర్ అని ఆయన అభిమానులు మాట్లాడుకుంటున్నారు. మరి చూడాలి నెక్స్ట్ బైరెడ్డికి ఎలాంటి ఛాన్స్ వస్తుందో?