అక్కడ టీడీపీకి పవన్ కావాల్సిందేనా?
ఏపీలో జనసేన ప్రభావం పెద్దగా లేదని, ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో రుజువైన విషయం తెలిసిందే. అయితే స్వతహాగా జనసేన గెలవలేదు గానీ, టీడీపీని మాత్రం ఓడించింది. చాలాచోట్ల ఓట్లు చీల్చి టీడీపీకి పెద్ద బొక్క పెట్టింది. దాని వల్ల వైసీపీకి బాగా లాభం జరిగింది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన వల్ల టీడీపీకి భారీ నష్టం జరిగింది.
మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చి టీడీపీ ఓటమికి కారణమైంది. జిల్లాలో అన్నీ మున్సిపాలిటీలు వైసీపీనే కైవసం చేసుకుంది. ఏలూరు కార్పొరేషన్ ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే పలు మున్సిపాలిటీల్లో టీడీపీ కంటే జనసేన ఎక్కువ వార్డులు గెలుచుకుంది.
ఒకవేళ జనసేన-టీడీపీలు కలిసి పోటీ చేసి ఉంటే ఫలితాలు వేరుగా వచ్చేవి. జిల్లాలో సగం మున్సిపాలిటీలు గెలుచుకునేవి. ఇక ఇదే విషయంపై టీడీపీ కార్యకర్తలు కూడా గట్టిగానే ఆలోచిస్తున్నారు. పవన్‌తో కలిస్తేనే పశ్చిమలో వైసీపీకి చెక్ పెట్టగలమని అనుకుంటున్నారు.
2014 ఎన్నికల్లో పవన్ మద్ధతు ఇవ్వడం వల్లే జిల్లాలో టీడీపీ క్లీన్‌స్వీప్ చేసింది. జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో 14 టీడీపీ గెలుచుకుంది. ఒకటి టీడీపీతో పొత్తుతో బీజేపీ గెలిచింది. అలాగే రెండు పార్లమెంట్ స్థానాలు కూడా టీడీపీ-బీజేపీలకే దక్కాయి.
ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా బరిలో దిగింది. అటు జనసేన కూడా ఒంటరిగానే పోటీ చేసింది. ఫలితంగా ఓట్లు భారీగా చీలిపోయి వైసీపీకి ప్లస్ అయింది. జిల్లాలో 13 సీట్లు వైసీపీ గెలుచుకుంటే, రెండు టీడీపీ గెలుచుకుంది. జనసేనకు ఒక్కటి కూడా దక్కలేదు. రెండు పార్లమెంట్ స్థానాలు కూడా వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. అదే టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేసి ఉంటే సగం సీట్లు గెలుచుకునేవారు.
ఇలా అసెంబ్లీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన వల్ల టీడీపీ భారీగానే నష్టపోయింది. కాబట్టి పవన్‌తో పొత్తుతో పెట్టుకుంటే జిల్లాలో టీడీపీకి బాగా కలిసొస్తుందని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనైనా జనసేనతో కలిస్తే వైసీపీకి చెక్ పెట్టొచ్చని అనుకుంటున్నారు. మరి చూడాలి వచ్చే రాజకీయాలు ఎలా మారతాయో.