బెజవాడ రాజకీయాలు దేవినేనికి కలిసొచ్చినట్లేనా....!
ఇలా నాయకుల మధ్య విబేధాలు వైసీపీకి ఏ విధంగా కలిసొచ్చిందో తెలిసిందే. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. కనీసం 20 డివిజన్లు కూడా గెలుచుకోలేకపోయింది. అయితే ఈ ఓటమి దెబ్బకు విజయవాడలో కేశినేని హవా తగ్గినట్లైంది. ఇదే సమయంలో దేవినేని ఉమాకు కలిసొచ్చిందనే చెప్పొచ్చు.
మామూలుగా కృష్ణా జిల్లా రాజకీయాలపై ఉమా ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. గత రెండు దశాబ్దాలుగా టీడీపీలో ఉమా పెత్తనం నడుస్తోంది. అయితే 2019 ఎన్నికల్లో జగన్ దెబ్బకు ఉమా తొలిసారి ఓడిపోయారు. ఈ ఓటమితో ఉమా పెత్తనం తగ్గింది. ముఖ్యంగా విజయవాడ నగరంపై ఉమా పట్టు కోల్పోయారు. ఇక్కడ ఎంపీగా ఉన్న కేశినేని హవా ఎక్కువైంది. దీంతో ఉమాకు విజయవాడలో ఎంట్రీ తగ్గింది. అయితే ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఉమాకు ప్లస్ అయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే కార్పొరేషన్లో గెలుపు భారాన్ని కేశినేని తన భుజాలపై వేసుకున్నారు. ఎలాగైనా టీడీపీ జెండా ఎగరేసేలా చేస్తానని శపథం కూడా చేశారు. పైగా సొంత నేతలపైనే విమర్శలు గుప్పించారు.
ఇక చివరికి ఎన్నికల ఫలితాల్లో టీడీపీ జెండా ఎగరలేదు. ఈ దెబ్బకు కేశినేని కూడా కనబడటం తగ్గించేశారు. ఇలా విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఓటమి కేశినేనికి మైనస్ అయితే దేవినేనికి ప్లస్ అయినట్లు కనిపిస్తోంది. మొత్తానికైతే కృష్ణా జిల్లాలో మళ్ళీ ఉమా ఆధిపత్యం పెరిగేలా ఉందనే చెప్పొచ్చు.