జగన్ ని ఫాలో అవుతున్న ముఖ్యమంత్రులు..

Deekshitha Reddy
ఏపీ సీఎం జగన్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచారు. మిగతా విషయాల్లో ఏమో కానీ, రేషన్ డోర్ డెలివరీ విషయంలో మాత్రం జగన్ ని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకున్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే విడుదల చేసిన మేనిఫెస్టోలో రేషన్ డోర్ డెలివరీ ప్రధానాంశంగా ఉంది. ఇంటి వద్దకే రేషన్ సరకులు తెచ్చి ఇస్తామని, రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.. ముఖ్యమంత్రి పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.

ఇటు పశ్చిమబెంగాల్ లో కూడా అదే సీన్ కనపడుతోంది. పశ్చిమ బెంగాల్‌ లో తృణమూల్ కాంగ్రెస్ ‌‌కు మరోసారి అధికారం ఇస్తే ప్రజలకు ఉచిత రేషన్ నేరుగా ఇంటికే సరఫరా చేస్తామని ఆ పార్టీ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల హామీ ఇచ్చారు. పురూలియాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం మమత, టీఎంసీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఉచిత రేషన్ కొనసాగుతుందని, మే తర్వాత రేషన్ దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటికే రేషన్ సరఫరా చేస్తామని చెప్పారు. వితంతువులందరికీ రూ.1,000 పింఛన్ గా ఇచ్చేందుకు బడ్జెట్‌లో నిర్ణయం తీసుకున్నామని, 60 ఏళ్లు పైబడిన గిరిజనులకు రూ.2,000 పింఛన్ ఇస్తామని చెప్పారు.

బెంగాల్ లో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుంటే, మరోవైపు బీజేపీ ఇంధనం, గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతోందని విమర్శించారు మమత. ప్రజలెవరూ తలవంచుకుని బతకాల్సిన పనిలేదని మమత సూచించారు. సిద్ధాంతాలు, నడవడిక, నైతికత, విలువలు కోల్పోతే ప్రతీదీ కోల్పోయినట్టేనని అన్నారామె.

మొత్తమ్మీద నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో.. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో రేషన్ డోర్ డెలివరీ హామీ తెరపైకి వచ్చింది. రాబోయే రోజుల్లో మరిన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో ఈ హామీని చేర్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో ప్రతిపక్షాలు రేషన్ డోర్ డెలివరీపై విమర్శలు గుప్పిస్తున్న వేళ, ఇతర రాష్ట్రాలు జగన్ ని ఫాలో అవడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: